అధికారంలో ఉన్నప్పుడు పదే పదే వైసీపీపై చంద్రబాబు ఓ విమర్శ చేస్తుండేవారు. ప్రతిపక్షంగా ఆ పార్టీ విఫలమైందని, అధికార పార్టీకి సహకరించడం లేదని, జగన్ ప్రతిపక్ష నేతగా పనికిరారని చెబుతుండేవారు. ఇప్పుడు చంద్రబాబు ప్రతిపక్షనేతగా ఉన్నారు. అందరూ 100రోజుల జగన్ పాలనపై సమీక్షలు చేస్తున్నారు, మరి 100రోజుల ప్రతిపక్షనేతగా చంద్రబాబు ఏం సాధించారు? ఎంతవరకు ప్రభుత్వానికి సహకరించారు? అసలు ప్రతిపక్షం 100రోజుల్లో చేసిందేంటి?
అధికారంలో ఉన్నప్పుడు ఆస్తులు సంపాదించుకోవడం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాటిని కాపాడుకోవడం. ఇదీ చంద్రబాబుకి తెలిసిన పని. ఈసారి కూడా ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత అదే చేస్తున్నారు బాబు. అధికారం కోల్పోవడాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతున్న చంద్రబాబు ఎందుకు ఓడిపోయామో తెలుసుకోడానికే 50రోజుల సమయం గడిపారు. తీరా కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు.. సామాజిక సమీకరణాలు కుదరక ఓడిపోయామంటూ తేల్చారు. పోనీ ఆ తర్వాత అయినా నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ప్రజల్లోకి వెళ్లారా అంటే అదీ లేదు.
తన ఇంటిని ముంచేందుకు వరదల్లో పడవను అడ్డుపెట్టారని, రాజధానిని తరలించుకు పోతున్నారని, తమవారిపై దాడులు చేస్తున్నారంటూ అన్నీ కల్పిత కథలల్లుతూ కాలక్షేపం చేస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలు మినహా టీడీపీ ఎమ్మెల్యేలు ప్రజలకు కనపడిన దాఖలాలు లేవు. ఒకరు సినిమా షూటింగుల్లో బిజీ, ఇంకొకరు సొంత వ్యాపారాల్లో బిజీ. ఇలా ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉంది టీడీపీ ఎమ్మెల్యేల పరిస్థితి. ప్రజల్లోకి వెళ్లినవారు ఎవరంటే 23మందిలో ఒకరిద్దర్ని వేళ్లమీద లెక్కపెట్టొచ్చు. వారు కూడా వైసీపీపై తమ వర్గాన్ని రెచ్చగొట్టడానికే వెళ్లారు తప్ప, నిజంగా స్థానిక సమస్యలేంటి, వాటి పరిష్కారానికి ఏంచేయాలి అనే ఉద్దేశం ఎంతమాత్రం వారికి లేదు.
ఐదేళ్లపాటు అధికార పార్టీగా దారుణంగా విఫలమైన టీడీపీ.. 100రోజుల ప్రతిపక్షంగా అంతకంటే చీప్ గా వ్యవహరిస్తోంది. మంత్రుల్ని, ఎమ్మెల్యేలను కులంపేరుతో దూషిస్తూ ప్రజల్ని రెచ్చగొడుతున్నారు, ఎంత నీచానికైనే దిగజారడానికి సిద్ధం అన్నట్టు ప్రవర్తిస్తున్నారు టీడీపీ నేతలు. ఈ 100రోజుల్లో చంద్రబాబు పరిస్థితి మరీ తీసికట్టుగా తయారైంది. నాయకుల్ని కాపాడుకోలేక, అటు జగన్ ని ఇరుకున పెట్టలేక తాను ఇబ్బందిపడిపోతున్నారు చంద్రబాబు. ప్రతిపక్ష నేతగా చంద్రబాబు కష్టం పగవాడికి కూడా వద్దు.