తన పక్కనున్న 22మంది ఎమ్మెల్యేల్లో ఎవరు ఎప్పుడు గోడ దూకుతారోనని ఆందోళన చెందుతున్నారు చంద్రబాబు. ఆపడం తన చేతుల్లో లేదు కానీ వారిపై ఓ కన్నేసి తన జాగ్రత్తలో తాను ఉంటున్నారు. అసెంబ్లీలో స్పీకర్ ని చైర్లో కూర్చోబెట్టే విషయం నుంచే టీడీపీ, వైసీపీ ఒకరిపై ఒకరు మాటల యుద్ధానికి దిగారు. ఆ సమయంలో చంద్రబాబు సహా బంట్రోతు అనేమాటతో ఫీలైన అచ్చెన్నాయుడు మాత్రమే కాస్త గట్టిగా స్పందించగలిగారు.
సభ అయిపోయిన తర్వాత బాలకృష్ణ రియాక్ట్ అయ్యారు. ఎమ్మెల్సీ బుద్ధావెంకన్న సరే సరి. మరి మిగతావారి సంగతేంటి? సభలో బాబుపై అంత రచ్చ జరిగినా ఎవరూ ఎందుకు స్పందించలేదు. గన్నవరం ఎయిర్ పోర్ట్ లో జరిగిన వ్యవహారంపై మొక్కుబడిగా ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే ప్రదర్శన చేయడం ఏంటి? ఇలాంటి విషయాలన్నిటిపై బాబు కూపీ లాగుతున్నారట.
పార్టీ మారాలన్న ఆలోచన ఉన్నవారిని కనిపెట్టి, వారికి ఎరవేసి గోడదూకేలా చేయడంలో చంద్రబాబుది అందెవేసిన చేయి. దొంగకి మరో దొంగ ఎలా ఉంటాడో, ఎలా ప్రవర్తిస్తాడో తెలియదా? అందుకే పూర్తి సైలెంట్ గా ఉండేవారిని, ఏమీలేకపోయినా ఓవర్ యాక్షన్ చేసే వారిని ఓ కంట కనిపెడుతున్నారు బాబు. వైసీపీ చెబుతున్నట్టు 10 మంది లిస్ట్ తేలలేదు కానీ, ఐదుగురిపై మాత్రం బలమైన అనుమానం ఉందట.
మాజీ మంత్రి గంటా సహా విశాఖ నాలుగు సీట్లపై చంద్రబాబుకి అనుమానం ఉందట. ప్రకాశంజిల్లా నుంచి గొట్టిపాటి రవికుమార్ పేరు కూడా వినిపిస్తోంది. ఈ లిస్ట్ లో లేనంత మాత్రాన మిగతా వారేం విధేయులు కాదు, వారి ప్రయత్నాల్లో వారు ఉన్నారు కానీ బాబు కంట్లో పడలేదని అర్థం.
ఈమేరకు అసెంబ్లీలో, అసెంబ్లీ బయట ఎమ్మెల్యేల ప్రవర్తనపై కన్నేసి ఉంచేందుకు ఓడిపోయిన ముగ్గురు సీనియర్లతో ఓ టీమ్ ఏర్పాటు చేశారు బాబు. ఆ ముగ్గురే ఇప్పటివరకు ఈ ఐదుగుర్ని కనిబెట్టగలిగారు.