Advertisement

Advertisement


Home > Politics - Gossip

స్వరూపానందకే షాకిచ్చిన రేషన్ డీలర్లు

స్వరూపానందకే షాకిచ్చిన రేషన్ డీలర్లు

అధికారుల దగ్గరికో నాయకుల దగ్గరికో వెళ్లినప్పుడు వారికి ఓ అర్జీ ఇచ్చి ఆ తర్వాత బైటకొచ్చి తమకి నచ్చినట్టు చెప్పుకుంటుంటారు చాలామంది. సానుకూలంగా విన్నారని, సానుభూతి చూపించారని, పరిష్కారం దిశగా ఆలోచిస్తామని హామీ ఇచ్చారని.. ఇలాంటి పడికట్టు పదాలు చాలానే దొర్లుతుంటాయి.

శారదా పీఠాధిపతి స్వరూపానందని ఇటీవల రేషన్ డీలర్లు కలిశారు. తమ సమస్యను ఆయన సానుకూలంగా విన్నారని సీఎం జగన్ కి చెప్పి డీలర్ల విషయంలో సానుభూతితో వ్యవహరించమని చెబుతానని స్వామీజీ హామీ ఇచ్చినట్టు బైటకొచ్చి చెప్పుకున్నారు డీలర్లు. అయితే ఇక్కడ అద్భుతంగా ఓ డ్రామా నడిచింది. స్వామీజీని కలసిన రేషన్ డీలర్ల గుంపు, అసలు యూనియన్ లో ఓ వర్గం మాత్రమే.

కేవలం సీఎం జగన్ ని టార్గెట్ చేయడం కోసమే వారు ఈ పనిచేసినట్టు తెలుస్తోంది. గతంలో జగన్ స్వామీజీని కలిసినప్పుడు టీడీపీ నేతలు నానా హంగామా చేశారు. స్వరూపానంద పవర్ సెంటర్ గా మారుతున్నారని అన్నారు. దీనికి తగ్గట్టే మంత్రివర్గ కూర్పు సమయంలో చాలామంది ఆశావహులు స్వరూపానంద దర్శనానికి ఎగబడ్డారు. ఆ తర్వాత జగన్ నుంచి సూచనలు వెళ్లాయో లేక స్వామీజీయే అవగాహన చేసుకున్నారో తెలియదు కానీ.. ఇటీవల రాజకీయ తాకిడి శారదా పీఠానికి కాస్త తగ్గింది.

అయితే తాజాగా రేషన్ డీలర్లు మళ్లీ ఈ తేనెతుట్టెను కదిపారు. గతంలో తెలంగాణ రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగులు కొంతమంది చినజీయర్ స్వామీజీకి వినతిపత్రం ఇవ్వడం సంచలనం రేకెత్తించింది. సీఎం తమమాట వినట్లేదని, మీరైనా ఆయనకు చెప్పండంటూ రెవెన్యూ ఉద్యోగులు నడిపించిన ఎపిసోడ్ కేసీఆర్ పై విమర్శలకు కారణమైంది. ఏపీలో కూడా జగన్ ని ఇలాగే ఇబ్బంది పెట్టాలని టీడీపీ ప్రేరేపిత రేషన్ డీలర్ల వర్గం ఈ ఎత్తుగడ వేసింది.

అర్జీ ఇవ్వడానికి వస్తున్నామని కబురుపంపితే శారదా పీఠం నిర్వాహకులు నిర్ద్వందంగా తోసిపుచ్చారు. దీంతో భక్తుల ముసుగులో డీలర్లు స్వామీజీని కలిశారు. ఎక్కడా డీలర్లు అనే ప్రస్తావనే రాలేదు. అసలు డీలర్ల సమస్య కూడా స్వరూపానందకు తెలియదు. అయితే స్వామీజీతో రేషన్ డీలర్లు మాట్లాడుతున్న ఫొటోలు, ఆశీర్వాదం తీసుకుంటున్న ఫొటోలు వెంటనే బైటకు వచ్చేశాయి. అలా ఈ ఎపిసోడ్ ని రాజకీయ లబ్ధికోసం టీడీపీ వాడుకోవాలని చూస్తోంది. స్వామీజీని కలిస్తే పనులు అయిపోతాయని, శారదా పీఠం పవర్ సెంటర్ గా మారుతోందని కథలల్లడం స్టార్ట్ చేశారు.

వాస్తవానికి స్వరూపానందకు రేషన్ డీలర్ల సమస్య తెలియనే తెలియదు. కేవలం భక్తుల్లాగా ఆయన ఆశీర్వాదం తీసుకుని ఫొటోలు దిగి చివరకు శారదా పీఠంపైనే ఆరోపణలు వచ్చేలా చేశారు. దీనిపై అసలు సంఘం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇలాంటి చీప్ ట్రిక్స్ తో రేషన్ డీలర్లపై సమాజంలో గౌరవం పూర్తిగా తగ్గిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సంఘం అసలు నేతలు. 

జగన్‌ ఇంత దైర్యంగా చెప్పగలుగుతున్నారేమిటి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?