తెలంగాణ కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క వెళ్లి కాంగ్రెస్ ఎమ్మెల్యేనే అయినప్పటికీ సొంత పార్టీపై విమర్శలను గుప్పిస్తున్న కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డితో సమావేశం కావడం వెనుక రహస్యం ఏమిటనేది ఆసక్తిదాయకంగా మారింది.
ఈ అంశంపై భట్టి విక్రమార్క వైపు నుంచి వినిపిస్తున్న వాదన… రాజగోపాల్ రెడ్డిని శాంతింపజేయడానికి తను వెళ్లారు. అయితే రాజగోపాల్ రెడ్డి మాత్రం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వైఖరి పై విరుచుకుపడ్డారు మరోసారి. నిన్నలా మొన్న వచ్చిన వారికి పీసీపీ పదవులా అంటూ.. పరోక్షంగా రేవంత్ రెడ్డి విషయంలో రాజగోపాల్ రెడ్డి విరుచుకుపడ్డారు.
అలాగే.. భట్టి విక్రమార్కకు పీసీసీ అధ్యక్ష పదవిని ఇవ్వాల్సింది అన్నారు. తెలంగాణలో బీజేపీ పుంజుకుంటోందని, టీఆర్ఎస్ ను బీజేపీ ఓడించి తీరుతుందంటూ తను ఇంకా చేరని పార్టీ తరఫున మాట్లాడారు రాజగోపాల్ రెడ్డి. ఇదంతా బయటకు కనిపించే దృశ్యం. అయితే… ఇంతకీ భట్టి విక్రమార్క వెళ్లి రాజగోపాల్ రెడ్డితో సమావేశం వెనుక పైకి చెప్పే రాయబారం కాకుండా మరో రాయబారం నడిచిందనే టాక్ వినిపిస్తోంది.
రాజగోపాల్ రెడ్డిని ఒప్పించి టీఆర్ఎస్ లోకి తీసుకెళ్లే ప్రయత్నంలో మల్లు భట్టి విక్రమార్క చేశారనేది పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట! త్వరలోనే భట్టి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోబోతున్నారని.. తను ఒక్కడే వెళ్లడం కాకుండా కాంగ్రెస్ వైపు నుంచి మరికొందరిని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారట భట్టి.
ఇప్పుడు కాంగ్రెస్ కు దూరంగా ఉంటున్న రాజగోపాల్ రెడ్డితో భట్టి సమావేశం వెనుక వ్యూహం ఇదేనని టాక్. రాజగోపాల్ రెడ్డిని కూడా టీఆర్ఎస్ లోకి తీసుకెళ్లడానికి భట్టి ప్రయత్నిస్తున్నారని భోగట్టా.
అయితే ఈ సమావేశం ముగిశాకా.. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ ను యథారీతిన తిట్టారు. అయితే టీఆర్ఎస్ ను బీజేపీ ఓడిస్తుందంటూ.. తను కాషాయ కండువా పట్ల ఆసక్తితో ఉన్న వైనాన్ని చాటారు. భట్టి మాత్రం కాంగ్రెస్ హైకమాండ్ ను పొగిడారు. తెలంగాణలో తదుపరి అధికారం కాంగ్రెస్ దేనన్నారు.
అయితే భట్టి మాత్రం ఎక్కువకాలం కాంగ్రెస్ లో ఉండబోవడం లేదని, ఆయన టీఆర్ఎస్ లో చేరవచ్చనేది పుకార్ల సారాంశం.