Advertisement

Advertisement


Home > Politics - Gossip

బాబుకు షాక్‌...ఇండిపెండెంట్ అభ్య‌ర్థిగా భూమా!

బాబుకు షాక్‌...ఇండిపెండెంట్ అభ్య‌ర్థిగా భూమా!

టీడీపీ అధినేత చంద్ర‌బాబునాయుడికి నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డి గ‌ట్టి షాక్ ఇచ్చారు. నంద్యాల అభ్య‌ర్థిగా మాజీ మంత్రి ఫ‌రూక్ అభ్య‌ర్థిత్వాన్ని ఖ‌రారు చేస్తూ ఇటీవ‌ల టీడీపీ అధిష్టానం ప్ర‌క‌ట‌న చేసింది. టీడీపీ అధిష్టానం వైఖ‌రిపై ఆ పార్టీ నంద్యాల ఇన్‌చార్జ్ భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డి, ఆయ‌న అనుచ‌రులు ర‌గిలిపోతున్నారు. స‌ర్వే నివేదిక‌లు త‌న‌కు అనుకూలంగా వ‌చ్చిన‌ప్ప‌టికీ, ఇందుకు భిన్నంగా మ‌రొక‌రికి టికెట్ ఖ‌రారు చేయ‌డం ఏంట‌ని ఆయ‌న ప్ర‌శ్నిస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో నంద్యాల నియోజ‌క‌వ‌ర్గంలోని త‌న ముఖ్య అనుచ‌రుల‌తో బ్ర‌హ్మానంద‌రెడ్డి స‌మావేశం అయ్యారు. నాలుగున్న‌రేళ్లుగా ఆర్థికంగా ఎన్నో క‌ష్ట‌న‌ష్టాల‌ను భ‌రిస్తూ టీడీపీ జెండా మోస్తున్న త‌న‌ను కాద‌ని మ‌రొక‌రికి ఇవ్వ‌డం ఏంట‌ని ఆవేద‌న‌తో ప్ర‌శ్నించారు. త‌న వ‌య‌సు 36 ఏళ్లు అని, ఎంతో రాజ‌కీయ భ‌విష్య‌త్ ఉన్న త‌న‌ను మొగ్గ‌ద‌శ‌లోనే తుంచేయాల‌నే ప్ర‌య‌త్నాల్ని స‌హించేది లేద‌ని ఆయ‌న వార్నింగ్ ఇచ్చారు. ఈ ద‌ఫా ఎన్నిక‌ల్లో స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా బ‌రిలో వుంటాన‌ని, స‌త్తా ఏంటో చూపుతాన‌ని ఆయ‌న తేల్చి చెప్పారు. త‌న‌కు అండ‌గా నిల‌వాల‌నే ఆయ‌న విజ్ఞ‌ప్తికి నియోజ‌క‌వ‌ర్గంలోని టీడీపీ ముఖ్య నాయ‌కుల నుంచి సానుకూల స్పంద‌న వ‌చ్చిన‌ట్టు తెలిసింది. దీంతో ఇక వెనుతిరిగి చూసుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని ఆయ‌న భావిస్తున్నార‌ని స‌మాచారం.

నంద్యాల‌లో శిల్పా కుటుంబాన్ని ఎదుర్కొనే శ‌క్తి సామ‌ర్థ్యాలు కేవ‌లం భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డికే ఉన్నాయి. అలాంటి నాయ‌కుడిని ప‌క్క‌న పెట్ట‌డం వెనుక కుటుంబ స‌భ్యుల్లోని ముఖ్య నాయ‌కుల కుట్ర‌లే కార‌ణ‌మ‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. నంద్యాల ఎమ్మెల్యే శిల్పా ర‌విచంద్రారెడ్డిని ఎదుర్కొనే స‌త్తా బ్ర‌హ్మానంద‌రెడ్డికి లేద‌ని, అంతేకాకుండా అధికార పార్టీ నేత‌ల‌తో కుమ్మ‌క్కాయార‌ని టీడీపీ అధిష్టానానికి ఓ మ‌హిళా మాజీ మంత్రి ఫిర్యాదు చేశార‌ని స‌మాచారం.

బ్ర‌హ్మానంద‌రెడ్డికి టికెట్ ఇస్తే స‌హ‌క‌రించే ప్ర‌శ్నే లేద‌ని, మ‌రెవ‌రికైనా ఇస్తే బాగుంటుంద‌ని టీడీపీ అధిష్టానానికి స‌ద‌రు మ‌హిళా నాయ‌కురాలు విన్న‌వించిన‌ట్టు తెలిసింది. ఈ క్ర‌మంలో మాజీ మంత్రి ఎన్ఎండీ ఫ‌రూక్ లేదా త‌న త‌మ్ముడికి టికెట్ ఇవ్వాల‌నే ప్ర‌తిపాద‌న తెచ్చార‌ని తెలిసింది. భూమా కుటుంబంలోని గొడ‌వ‌ల‌పై టీడీపీ ఇప్ప‌టికే అస‌హ‌నంగా వుంది.

దీంతో అస‌లు నంద్యాల టికెట్‌ను భూమా కుటుంబానికే లేకుండా, వ్యూహాత్మ‌కంగా మైనార్టీ అభ్య‌ర్థిని తెర‌పైకి తెచ్చింది. అయితే ఫ‌రూక్‌ను అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించ‌డం అంటే వైసీపీకి విజ‌యాన్ని బంగారు ప‌ల్లెంలో పెట్టి ఇచ్చిన‌ట్టే అనే చ‌ర్చ జ‌రుగుతోంది. మ‌రోవైపు భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డి బ‌రిలో వుంటే మాత్రం భారీగా టీడీపీ ఓట్ల‌కు గండిప‌డ‌నుంది. ఈ నేప‌థ్యంలో నంద్యాల స‌మ‌స్య‌ను టీడీపీ ఎలా ప‌రిష్క‌రించుకుంటుందో చూడాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?