గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరఫున ప్రచారానికి ఆ పార్టీ జాతీయ నాయకత్వం అంతా కదలిరాబోతోందట! కేంద్ర మంత్రులు పలువురు హైదరాబాద్ లో ప్రచారం చేయనున్నారట.
ఇప్పటికే ఆ పార్టీ జాతీయ నేత భూపేంద్ర యాదవ్ హైదరాబాద్ లో మకాం పెట్టారు. ఇక పక్కనున్న కర్ణాటక నుంచి వీర హిందుత్వ వాద ఎంపీ తేజస్వి సూర్యను రంగంలోకి దించారు! ఇంకా ఎంతో మంది రాబోతున్నారట, వారంతా గాక.. స్వయంగా అమిత్ షా కూడా వచ్చి ప్రచారం చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి!
ఎంత గ్రేటర్ హైదరాబాద్ అయినా అదొక కార్పొరేషనే! ఒక కార్పొరేషన్ ఎన్నికకు స్వయంగా భారతీయ జనతా పార్టీ సుప్రీం లీడర్లంతా రంగంలోకి దిగుతూ ఉండటం ఒకింత ఆశ్చర్యకరంగా, ఆసక్తిదాయకంగా మారింది!.
నిజంగానే అమిత్ షా కూడా ప్రచారానికి వస్తే.. బీజేపీ ఈ ఎన్నికలను చాలా చాలా సీరియస్ గా తీసుకున్నట్టు. అంతే కాదు.. తెలంగాణలో తన సర్వశక్తులూ ధారపోసేసినట్టే అవుతుంది.
కార్పొరేషన్ ఎన్నికలకే అమిత్ షా స్థాయి నేత వచ్చి ప్రచారం చేస్తే, రేపు అసెంబ్లీ ఎన్నికల నాటికి కొత్తగా చెప్పుకోవడానికి మిగిలింది ప్రధానమంత్రి మాత్రమే! కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని తప్ప బీజేపీ నేతలంతా వచ్చి ప్రచారం చేస్తే.. ఆ ఎన్నికలనే బీజేపీ చాలా తీవ్రంగా తీసుకున్నట్టే!
ఆల్రెడీ స్థానిక నేతలకు చేతగాక భూపేంద్ర యాదవ్ వచ్చారా? అనే విమర్శలకు లోటు లేదు! తెలంగాణలో తాము చాలా బలపడిపోయినట్టుగా బీజేపీ లోకల్ లీడర్లు చెబుతుంటారు. అలాంటప్పుడు మళ్లీ జాతీయ నేతలు వచ్చి కార్పొరేషన్ ఎన్నికల కోసం హైదరాబాద్ లో మకాం పెట్టాల్సిన అవసరం ఉందా? అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు.
భూపేంద్ర యాదవ్ దిగినప్పుడే ఆ ప్రశ్నలు ఉత్పన్నం అయ్యాయి. ఒక ఊర్లో స్థానిక ఎన్నికలకు ఎక్కడెక్కడి ఎంపీలూ, నేతలు రంగంలోకి దిగడం విశేష పరిణామంగా కనిపిస్తూ ఉంది. మరి ఇంతజేసీ.. రేపు బీజేపీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోలేకపోతే మాత్రం.. ఇంతేనా? అనే ప్రశ్న మరి కాస్త గట్టిగా ఎదురవడం ఖాయం!