ఎక్కడ రాజకీయ అనిశ్చితి ఉంటుందో అక్కడ వేలు పెట్టి లబ్ధిపొందడం బీజేపీకి అలవాటు. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ కొన్నిచోట్ల అధికారాన్ని దక్కించుకోడానికి ఇదే పద్ధతి ఉపయోగిస్తుంది. తాజాగా కర్నాటకలో జరిగింది ఇదే. కాంగ్రెస్, జేడీఎస్ కాపురాన్ని చిన్నాభిన్నం చేసేవరకు బీజేపీకి నిద్రపట్టలేదు. అసమ్మతిని ఎగదోసి కూటమిని కూలదోసి, చివరకు బీజేపీ గద్దెనెక్కింది.
స్పీకర్ రమేష్ కుమార్ ఎమ్మెల్యేలపై వేటు వేసి అందరిచేత శెహభాష్ అనిపించుకోవడం వెనక కూడా బీజేపీ హస్తం ఉందంటే నమ్మలేం. అసమ్మతి ఎమ్మెల్యేలపై వేటు అయాచితంగా బీజేపీకి విశ్వాస పరీక్ష సమయంలో లబ్ధిచేకూర్చింది. సో.. బీజేపీ ఎంత నీఛానికైనా దిగజారుతుందనడానికి ఇదే పెద్ద సంకేతం. గతంలో అరుణాచల్ ప్రదేశ్ లో కూడా ఇదే జరిగింది. పూర్తి మెజార్టీతో అక్కడ అధికారం చేపట్టిన కాంగ్రెస్ ని ముప్పతిప్పలు పెట్టి చివరకు బీజేపీ అక్కడ పాగావేసింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మొత్తం చివరికి సీఎం సహా పార్టీ ఫిరాయించడం చరిత్రలో అదే మొదటిసారి.
తమిళనాడులో జయలలిత మరణం తర్వాత బీజేపీ ఎలాంటి కుటిల నీతికి పాల్పడిందో అందరూ చూశారు. రేపు సీఎంగా ప్రమాణ స్వీకారం అనగా ఈరోజు శశికళ జైలుకెళ్లడం వెనక ఎవరున్నారో అందరికీ తెలుసు. అన్నాడీఎంకేలో అలజడులు సృష్టించి, కొంతమందినైనా తమవైపుకి తిప్పుకోవాలని చూసింది. చివరకు ముఖ్యమంత్రిపైకి అసమ్మతి ఎగదోసింది. పళనిస్వామి, పన్నీర్ సెల్వం మధ్య చిచ్చుపెట్టాలని చూసినా చివరకి అది వర్కవుట్ కాలేదు. అయితే లోక్ సభ ఎన్నికల్లో స్టాలిన్ ఆధ్వర్యంలోని డీఎంకే క్లీన్ స్వీప్ చేయడంతో బీజేపీ దూకుడు తగ్గించింది.
ఇక మధ్యప్రదేశ్ లో కూడా కర్నాటక పరిస్థితే ఉంది. అయితే అక్కడ మేజిక్ ఫిగర్ కి రెండంకెలు తక్కువగా ఉన్న కాంగ్రెస్.. బీఎస్పీ, ఎస్పీ, ఇండిపెండెంట్ల దయతో గద్దెనెక్కింది. అప్పటినుంచీ బీజేపీ అదను కోసం ఎదురుచూస్తోంది, తాజాగా కర్నాటకలో అధికార మార్పిడి జరిగిన నేపథ్యంలో మధ్యప్రదేశ్ పై కొంతమంది బీజేపీ నేతలు నోరుజారారు. తాము తలచుకుంటే ఎప్పుడో అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయేదని సవాళ్లు విసిరారు. అయితే అక్కడ విచిత్రంగా బీజేపీ ఎమ్మెల్యేలు కొంతమంది కాంగ్రెస్ కి మద్దతిచ్చే ప్రయత్నాల్లో ఉన్నారు.
ఇక ఏపీ విషయానికొద్దాం. ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇలాంటి రాజకీయ సంక్షోభం కోసమే బీజేపీ ఎదురుచూసింది. టీడీపీ, వైసీపీ, జనసేన త్రిముఖ పోరులో హంగ్ తప్పదని అంచనా వేసింది. బీజేపీ కంటే ఎక్కువగా టీడీపీ ఈ అంచనాల్లో మునిగితేలింది. వైసీపీ పెద్ద పార్టీగా అవతరించినా ప్రభుత్వ ఏర్పాటుకి ఎవరో ఒకరి మద్దకు అవసరమైన పక్షంలో జగన్ ని పక్కనపెట్టి వైసీపీలో చీలిక తేవాలనేది బీజేపీ మాస్టర్ ప్లాన్. ఆ దిశగానే టీడీపీ, బీజేపీ లెక్కలేసుకున్నాయి. కానీ జనసేన ఆటలో అరటిపండు కావడంతో అందరూ మునిగారు.
కనీవినీ ఎరుగని రీతిలో చరిత్రలో తొలిసారి 151 సీట్ల భారీ మెజార్టీతో గెలిచారు జగన్. దీంతో బీజేపీ పప్పులు ఉడకలేదు సరికదా, కనీసం దుర్మార్గపు ఆలోచన చేయడానికే వారి వెన్నులో వణుకు పుట్టింది. రాజ్యాంగంలోని లొసుగుల్ని ఉపయోగించుకునే ఛాన్స్ ఏపీలో బీజేపీకి దక్కలేదు. అందుకే చిన్నా చితకా నేతల చేరికలతో కాలక్షేపం చేస్తోంది. విమర్శలు పెంచుతోంది.
అయితే ఏపీలో ఎన్నిచేసినా చివరకు బీజేపీని రాష్ట్ర ప్రజలు ప్రత్యేకహోదా కోణంలోనే చూస్తారు. హోదా ఇస్తేనే బీజేపీకి ఏపీలో మనుగడ. లేదంటే దేశమంతా బీజేపీ హవా నడిచినా, ఏపీలో మాత్రం ఆ పార్టీ నేతలకు డిపాజిట్లు దక్కవు. ఇకనైనా కమలం నేతలు ఈ చీప్ పాలి'ట్రిక్స్' ఆపితే మంచిది.