ఆంధ్రప్రదేశ్‌లో ఎలాగైనా బలపడాలని బీజేపీ గట్టి పట్టుదలతో వుంది. తెలంగాణలో అధికారంపై బీజేపీకి నమ్మకం ఏర్పడింది. 2018లో తెలంగాణలో కేవలం ఒకే ఒక్క ఎమ్మెల్యే సీటు గెలిచిన బీజేపీ, కాలం గడిచే కొద్ది అధికారంలోకి వస్తామనే ధీమా పెరిగింది. ఇది ఒకింత ఆశ్చర్యమే. తెలంగాణలో కేసీఆర్ తప్పిదాలు, కాంగ్రెస్ బలహీనత వెరసి, బీజేపీకి రాజకీయంగా కలిసిస్తోంది. తెలంగాణలో బీజేపీలో బలమైన నాయకత్వం ఉంది.
కానీ ఏపీలో బీజేపీని నాయకత్వ సమస్య పట్టి పీడిస్తోంది. జనసేనతో కలిసి మూడో ప్రత్యామ్నాయంగా ఎదగాలని వ్యూహం రచించినప్పటికీ, పవన్‌కల్యాణ్ వ్యవహార శైలితో విసుగ్గా ఉంది. జనసేనతో పేరుకే పొత్తు. చంద్రబాబును సీఎం చేయాలని జనసేనాని పవన్‌కల్యాణ్ గట్టి పట్టుదలతో ఉండడంపై బీజేపీ గుర్రుగా ఉంది. దీంతో ఏపీలో సొంతంగా ఎదిగేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది.
ఈ క్రమంలో చేరికలపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా కాంగ్రెస్ సీనియర్ నేత, పరిపాలన అనుభవం ఉన్న నాయకుడిపై బీజేపీ దృష్టి సారించినట్టు తెలిసింది. ఇటీవల కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షాతో సదరు కాంగ్రెస్ సీనియర్ నేత ఢిల్లీలో రహస్య చర్చలు జరిపినట్టు అత్యంత విశ్వసనీయ సమాచారం. అయితే ఈ చర్చలు ప్రారంభం మాత్రమే అని బీజేపీ నేతలు చెబుతున్నారు.
బీజేపీలో చేరితే తన పాత్ర ఏంటనే ప్రశ్నను అమిత్‌షా ముందు పెట్టినట్టు తెలిసింది. ముందు ఆ విషయంపై స్పష్టత వస్తే బీజేపీలో చేరాలా? వద్దా? అనేది నిర్ణయించుకుంటానని అమిత్‌షాకు సదరు సీనియర్ నాయకుడు తేల్చి చెప్పినట్టు తెలిసింది.
సదరు నాయకుడు చేరితే బీజేపీకి ఆశాకిరణమవుతారని కేంద్ర పెద్దలు భావిస్తున్నారు. పైగా ఆంధ్రప్రదేశ్‌ను విడిపోకుండా చివరి వరకూ అలుపెరగని పోరాటం చేసిన పాలకుడిగా ఆయనకు గుర్తింపు వుంది. ఇది రాజకీయంగా తమకు పనికొస్తుందని బీజేపీ భావిస్తోంది.