ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని పూర్తిగా బలహీన పరచి, భాజపా తమలో కలిపేసుకుని, స్థానికంగా బలాన్ని పెంచుకునే యోచనలో ఉన్నదనే ఊహాగానాలు చాలాకాలంగా నడుస్తున్నాయి. అయితే ఏపీలో ముందు ఈ పర్వం పూర్తవుతుందని అనుకుంటుండగా.. తెలంగాణలో తెలుగుదేశాన్ని క్లీన్ స్వీప్ చేసే (ఊడ్చేసే) పనిలో భాజపా ముందుగా చేపట్టింది. ఈనెల 18న భారీ బహిరంగసభ నిర్వహించి.. ఆ రాష్ట్రంలో తెలుగుదేశంలో మిగిలిన నాయకులను చాలావరకు కమలదళంలో కలుపుకోవడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
తెదేపా రాజ్యసభ సభ్యులు నలుగురు ఎన్నికల అనంతరం కమలతీర్థం పుచ్చుకున్న సంగతి అందరికీ తెలిసిందే. వారిలో తెలంగాణ ప్రాంతానికి చెందిన గరికపాటి మోహనరావు కూడా ఉన్నారు. ఆయన ద్వారా.. భాజపా తెలంగాణలో మొదలుగా పావులు కదపడం ప్రారంభించింది. రాష్ట్రస్థాయినాయకులు, కొందరు జిల్లా అధ్యక్షులు, గత ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా పోటీచేసిన వారు.. ఇలాంటి అనేక మందిని సమీకరించి.. గరికపాటి మోహనరావు వారందరినీ భాజపాలోకి తీసుకువెళుతున్నారు.
తెలుగుదేశం నుంచి వలసలకోసం నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో భారీ బహిరంగ సభను నిర్వహించడానికి సైతం సన్నాహాలు జరుగుతున్నాయి. దీనితో తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కేవలం నామమాత్ర అవశేషంగా మిగలడానికి మరో అడుగు చేరువ అవుతుంది.
ఇప్పటికే తెలంగాణ తెలుగుదేశం అంటే.. అధ్యక్షుడు రమణ, రావుల చంద్రశేఖర రెడ్డి తప్ప మరొకరు కనిపించడం లేదు. వినిపించడం లేదు. పేరుకు తెలుగుదేశం రెండు రాష్ట్రాల్లోనూ ఉన్న జాతీయ పార్టీ అనే హోదాను చాటుకుంటోంది గానీ.. ఆ పార్టీకి ఏపీకి మాత్రం పరిమితమైన వైఎస్సార్ కాంగ్రెస్ కు ఉన్నంత నాయకత్వ బలం, కార్యకర్తల ఆదరణ కూడా కనిపించడం లేదు.
కేవలం హైదరాబాదులో తనకున్న ఆస్తుల పరిరక్షణ కోసం మాత్రమే చంద్రబాబునాయుడు అక్కడ పార్టీని మనుగడలో ఉంచుతున్నారా? అనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి. తూతుమంత్రంగా అప్పుడప్పుడూ పార్టీ సమీక్ష సమావేశాలు పెట్టడం తప్ప.. తెలంగాణ తెదేపా నిర్మాణం కోసం చంద్రబాబు చేస్తున్నది కూడా లేదు.