అసెంబ్లీ సమావేశాలు జరిగినా, కేబినెట్ మీటింగ్ జరిగినా.. అవి పూర్తయిన కాసేపటికే ప్రెస్ మీట్ పెట్టడం చంద్రబాబుకి అలవాటు. చెడామడా ప్రభుత్వాన్ని తిట్టేసి, తన అక్కసునంతా వెళ్లగక్కి తర్వాత పవన్ కి గ్రీన్ సిగ్నల్ ఇస్తారు బాబు. ఆ వెంటనే పవన్ కల్యాణ్ ప్రెస్ మీట్ పెట్టడమో, ట్వీట్ల వర్షం కురిపించడమో స్టార్ట్ చేస్తారు. బాబు పాడిన పాటకు కోరస్ పాడేసి ముగిస్తారు. ఏదో సినిమాలో చెప్పినట్టు బాబు శాసిస్తాడు, పవన్ పాటిస్తాడన్నమాట.
జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ చూస్తూనే ఉన్నాం ఈ తంతు. కానీ ఉన్నట్టుండి నిన్న కేబినెట్ భేటీ తర్వాత సగం పనే పూర్తయింది. చంద్రబాబు ప్రెస్ మీట్ పెట్టి తన గోడు వెళ్లబోసుకున్నారు కానీ, ఆ తర్వాత పవన్ మాత్రం బయటకు రాలేదు. దత్తపుత్రుడు లేని లోటు నిన్న చంద్రబాబుకి బాగా తెలిసొచ్చింది. సొంత పుత్రుడు ఎలాగూ శుద్ధ దండగ అని తెలిసే, ఇటీవల దత్తపుత్రుడిపై ఎక్కువగా నమ్మకం పెట్టుకున్నారు చంద్రబాబు.
ఇసుక దీక్షలైనా, ఉల్లి రేట్లయినా, మీడియం గోలైనా చంద్రబాబు చూపిన దారిలోనే పవన్ నడిచేవారు, అధికారపక్షంపై విరుచుకుపడేవారు. కానీ రాజధాని రగడలో మాత్రం పవన్ ఆలోచనలో పడ్డారు. తొలిరోజు అతిగా స్పందించి ఇబ్బందుల్లో పడ్డ పవన్, తర్వాత అన్నయ్య చిరంజీవి కూడా తన నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడే సరికి సైలెంట్ అయ్యారు. కమిటీ నివేదిక తర్వాత మాట్లాడతానని చెప్పిన పవన్, ఆ తర్వాత కేబినెట్ భేటీ పూర్తయ్యాక, అది కూడా మూడు రోజుల తర్వాతే మీటింగ్ పెట్టుకున్నారు.
అయితే కేబినెట్ భేటీలో రాజధానుల విషయంపై జగన్ ఎటూ తేల్చకపోయే సరికి పవన్ కి కూడా ఏం మాట్లాడాలో తెలియడం లేదు. మరోవైపు ఇన్ సైడర్ ట్రేడింగ్ వ్యవహారం కూడా పవన్ కి జ్ఞానోదయం కలిగించినట్లవుతోంది. రాజధాని చుట్టుపక్కల టీడీపీ నేతలు, వారి బినామీలు భూములు కొన్నారు. ప్రభుత్వం దీనిపై విచారణ చేయిస్తోంది. ఈ నేపథ్యంలో అమరావతికి సపోర్ట్ చేస్తే, పరోక్షంగా టీడీపీ నేతల అవినీతిని కూడా పవన్ సమర్థించినట్లవుతుంది.
అందుకే జనసేన ఆచితూచి వ్యవహరించాలనుకుంటున్నారు. పైగా నిన్నటివరకు భార్యతో కలిసి క్రిస్మస్ సంబరాలు చేసుకున్న పవన్.. ఇప్పుడే మళ్లీ ల్యాండ్ అయ్యారు. సో.. ఈరోజు రెస్ట్ తీసుకొని రేపట్నుంచి బాబు ఆదేశాల మేరకు పవన్ మరోసారి ట్విట్టర్ పేజీలో నోరుపారేసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు.
మరోవైపు కేవలం జగన్ నే పవన్ విమర్శిస్తూ రావడం, ఇటు టీడీపీకి కూడా వరమైంది. పదే పదే పవన్ భుజంపై తుపాకీ పెట్టి, దాన్ని జగన్ పైకి ఎక్కుపెడుతున్నారు చంద్రబాబు. చంద్రబాబుకు తను అనుకున్న పనైపోతోంది. పవన్ కు నొప్పి మాత్రం మిగులుతోంది. అందుకే రాజధాని విషయంలో పవన్ వ్యూహాత్మకంగా వెనక్కు తగ్గారు. తనని వాడుకోవాలని చూస్తున్నవారికి ఆ అవకాశం ఇవ్వకూడదనుకుంటున్నారు. ఈసారైనా బాబు బుట్టలో పవన్ పడకుండా ఉంటారా? లేక తనకు తెలియకుండానే తాను ఓ పావుగా మారిపోతారా?