ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మానస పుత్రిక సచివాలయ వ్యవస్థ. ఈ వ్యవస్థలో శాశ్వత ఉద్యోగులను పక్కన పెడితే, వీరికి సాయంగా ఉండేందుకు ప్రతి 50 ఇళ్లకు ఓ వలంటీర్‌ను జగన్ ప్రభుత్వం నియమించింది. వీరే రానున్న ఎన్నికల్లో తమ సైన్యంగా వైసీపీ నేతలు భావిస్తున్నారు.
ప్రతిదీ వలంటీర్లు, సచివాలయ ఉద్యోగుల కనుసన్నల్లోనే ప్రభుత్వం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల్లో వలంటీర్లు కీలక పాత్ర పోషిస్తారని, తమను రాజకీయంగా దెబ్బతీస్తారని ప్రతిపక్షాలు ఆందోళన చెందుతున్నాయి.
అందుకే వారికి ఎన్నికల విధులు కేటాయించొద్దని పదేపదే ఎన్నికల అధికారులకు ప్రతిపక్షాలు విన్నవించుకోవడం చూశాం. ఎన్నికల సంఘం కూడా వారి విన్నపాన్ని పరిగణలోకి తీసుకుని వలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా పెట్టింది. అయితే ఓటర్ల చేర్పులు, తొలగింపు వ్యవహారాల్లో వలంటీర్లు క్రియాశీలకంగా వ్యవహరించారు. దీంతో వలంటీర్లపై నెగెటివ్ కోణంలో వెళ్లడం కంటే, వారిని మంచి చేసుకోవడమే ఉత్తమమని చంద్రబాబునాయుడు ఆలోచిస్తున్నారని సమాచారం.
గతంలో వలంటీర్లపై చంద్రబాబు దారుణ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ వ్యవస్థను చెడ్డ చేసుకోవడం కంటే, తెలివిగా వాడుకోవడమే మంచిదని చంద్రబాబు ఆలోచనలో పడ్డారు.
ప్రస్తుతం వారికి 5 వేలు చొప్పున గౌరవ వేతనం ఇస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే రూ.10 వేలు చొప్పున గౌరవ వేతనం ఇస్తామనే హామీతో వారిని టీడీపీ వైపు తిప్పుకోడానికి చంద్రబాబు సిద్ధమైనట్టు తెలిసింది. ఎన్నికల ముంగిట ఈ ప్రకటన చేస్తారనే చర్చ టీడీపీ అంతర్గత సమావేశాల్లో సాగుతోంది. టీడీపీ అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలన్నీ అమలవుతాయని వారితోనే ప్రచారం చేయించడం చంద్రబాబు వ్యూహం.
మరోవైపు తమతో చాకిరీ చేయించుకుంటూ నామమాత్రంగా గౌరవ వేతనం ఇస్తున్నారనే ఆవేదన వలంటీర్లలో ఉంది. ఈ అసంతృప్తిని గౌరవ వేతనం పెంపు ప్రకటనతో రాజకీయంగా సొమ్ము చేసుకోవాలనే మాస్టర్ ప్లాన్ టీడీపీ చేసింది.
టీడీపీ ఆ ప్రకటన చేస్తే…వలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చిన వైసీపీ ఊరికే ఉంటుందని అనుకోలేం. మళ్లీ తాము అధికారంలోకి వస్తే… రూ.12 వేలు చొప్పున గౌరవ వేతనం ఇవ్వక తప్పదని పలువురు ఆ పార్టీ ఎమ్మెల్యేలు చెబుతున్నారు.