నేను ఫెయిలయ్యా.. మీరెవ్వరూ పరీక్ష రాయొద్దు!

మెగాస్టార్ చిరంజీవి మాటలు అచ్చం ఇలాగే కనిపిస్తున్నాయి. తనకు చేతకాలేదు గనుక.. తన తమ్ముడు కూడా చేతకానివాడుగానే నిరూపణ అయింది గనుక… మిగిలిన వారెవ్వరూ ప్రయత్నం కూడా చేయవద్దంటూ ఆయన హితోపదేశం చేస్తున్నారు. సైరా…

మెగాస్టార్ చిరంజీవి మాటలు అచ్చం ఇలాగే కనిపిస్తున్నాయి. తనకు చేతకాలేదు గనుక.. తన తమ్ముడు కూడా చేతకానివాడుగానే నిరూపణ అయింది గనుక… మిగిలిన వారెవ్వరూ ప్రయత్నం కూడా చేయవద్దంటూ ఆయన హితోపదేశం చేస్తున్నారు. సైరా విడుదలకు సిద్ధం అవుతున్న నేపథ్యంలో.. తమిళ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి… కమల్‌హాసన్, రజనీకాంత్ రాజకీయాల్లోకి రాకపోవడమే మంచిదంటూ హితవాక్యాలు చెప్పడం విశేషం.

‘నేను సినిమాల్లో నెంబర్ వన్‌గా, సూపర్ స్టార్ గా ఉన్నప్పుడే అన్నీ వదలుకుని రాజకీయాల్లోకి వచ్చా. కానీ నా సొంత నియోజకవర్గంలో కూడా ఓడిపోయా’ అంటూ ఆయన చెబుతున్న మాటలు చిత్రమైనవే. తన తమ్ముడు పవన్ కల్యాణ్ కు కూడా అదేమాదిరి పరిస్థితులు ఎదురయ్యాయని ఆయన గుర్తు  చేయడం విశేషం. చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు ఒక నియోజకవర్గంలో ఓడిపోతే.. పవన్ కల్యాణ్ తను బరిలోకి దిగిన రెండు నియోజకవర్గాల్లోనూ పరాజయం పాలయ్యాడు.

తమ ఓటములను ఉదాహరణలుగా చూపిస్తున్న చిరంజీవి… ఇటీవలి పార్లమెంటు ఎన్నికల్లో కమల్ పార్టీ పరాజయం కావడాన్ని కూడా ప్రస్తావస్తున్నారు. రజనీకాంత్ వచ్చే ఏడాదిలో తన పార్టీ ప్రకటనకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మధురై వేదికగా ఆయన పార్టీ ప్రకటన వ్యవహారం ఉంటుందని అంతా అనుకుంటున్నారు. జయలలిత, కరుణానిధి వంటి దిగ్గజాలు లేని తమిళ రాజకీయాలలో తమ సత్తా చూపించుకోవడానికి ఇద్దరు తమిళ మహానటులు ఉత్సాహపడుతున్నారు. అయితే చిరంజీవి లాంటి అనుభవజ్ఞుడు మాత్రం వారిని వారిస్తున్నాడు.

రాజకీయాలంటే డబ్బు మయం అయిపోయాయని వ్యాఖ్యానిస్తున్న చిరంజీవి… నిజాయితీగా ప్రజలకు ఏమైనా చేద్దాం అనుకున్నప్పటికీ ఏమీ చేయలేరంటూ శకునాలు పలుకుతున్నారు. నిజానికి చిరంజీవి తాను కలగన్నట్లుగా ముఖ్యమంత్రి కాలేకపోయి ఉండొచ్చు. కానీ, తన పార్టీని కాంగ్రెసులో కలిపేసిన తర్వాత.. ఆయన కేంద్రమంత్రి అయ్యారు. అంత పెద్ద పదవి అనుభవిస్తూ.. ప్రజలకు ఏం చేయదలచుకుని.. ఎందుకు చేయలేకపోయారో మరి.

తమకి మించిన  జనాదరణ మరెవ్వరికీ ఉండదని చిరంజీవి అనుకున్నారో ఏమో తెలియదు గానీ… కమల్, రజనీలకు అసలు రాజకీయాల్లోకి రానేవద్దంటూ సలహా ఇస్తున్నారు.