తెలంగాణకు చెందిన సీనియర్ నాయకుడు చెరుకు ముత్యం రెడ్డి.. కన్నుమూశారు. ప్రజాసంక్షేమం తప్ప మరొకటి ఎరగని, నిస్వార్థ రాజకీయవేత్తలలో ఆయన ఒకరు. ఆయన వయస్సు 74 సంవత్సరాలు. కొంతకాలంగా అనారోగ్య కారణాలతో బాధపడుతున్న ముత్యంరెడ్డి.. హైదరాబాదులోని ఒక ప్రెవేటు ఆస్పత్రిలో చికిత్సపొందుతూ కన్నుమూశారు.
చిన్న స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా పనిచేసినా.. ఆ తర్వాత మాజీ ఎమ్మెల్యే అయినా.. ఎన్నడూ ఒకేతీరుగా ప్రజలకు అందుబాటులో ఉంటూ.. సేవలందించిన నిగర్వి… ముత్యంరెడ్డి. మంత్రిగా ఉన్న రోజుల్లో కూడా ఖాళీ ఉన్నప్పుడు స్వయంగా తన సొంత పొలంలో పనిచేసుకుంటూ, ఎలాంటి భేషజాలు లేకుండా జీవితాన్ని గడిపిన నిష్కళంక నాయకుడు ముత్యంరెడ్డి.
ఆయన స్వగ్రామం సిద్ధిపేట జిల్లా తొగుట మండలం తుక్కాపూర్. గ్రామసర్పంచిగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ముత్యంరెడ్డి.. తర్వాతి కాలంలో నాలుగుసార్లు ఎమ్మెల్యే అయ్యారు. 1989లో దొమ్మాటనుంచి ఆయన తొలిసారి గెలిచారు. 1999లో పౌరసరఫరాల మంత్రిగా పనిచేశారు. 2009లో మళ్లీ దుబ్బాకనుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. నిజాయితీ గల నాయకుడిగా ఆయనకు మంచి పేరుంది. ఎన్నికల్లో ఓడిపోయినందుకు ఎలాంటి వక్రరాజకీయాలకు పాల్పడకుండా.. ప్రజాజీవితాన్ని వీడకుండా.. తనకు ఎంతో ఇష్టమైన వ్యవసాయంలో గడిపిన వ్యక్తి ఆయన.
చాలా కాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ.. 2018 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కేసీఆర్ పట్టుబట్టి ఆయనను తెరాసలో చేర్చుకున్నారు. సిద్ధిపేటలో హరీశ్ రావుకు అపరిమితమైన ప్రాభవం ఉన్నప్పటికీ.. ముత్యం రెడ్డి చేరిక పార్టీకే గౌరవప్రదం అయింది.
ముత్యంరెడ్డి మృతిపట్ల సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే హరీశ్ రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని కేసీఆర్ ఆదేశించారు. తెలుగుదేశంలో ఉన్న నాటినుంచి ముత్యంరెడ్డితో కేసీఆర్ విడదీయరాని స్నేహం ఉంది. తన సంతాపసందేశంలో ఆయన ఆ మైత్రిని గుర్తు చేసుకున్నారు.