ఇప్పుడు రాష్ట్రంలో విపక్షాలకు చెందిన నాయకుల్లో ఎవరి నోట విన్నా.. నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గొడవ వినిపిస్తోంది. జమీన్ రైతుపత్రిక సంపాదకుడు డోలేంద్రప్రసాద్ ను ఎమ్మెల్యే కొట్టారనే పోలీసు కంప్లయింటు నమోదైంది. దానిమీద ఇప్పుడు నానా రాద్ధాంతం జరుగుతోంది. అయితే అసలు ఏం జరిగింది అనే విషయంలో… ఆ సంఘటనకు ప్రత్యక్ష సాక్షి అయిన డాక్టర్ వసుంధర ఏం చెబుతుందనే దానిమీదనే ఆధారపడి ఉంది.
నెల్లూరునుంచి జమీన్ రైతుపత్రిక వెలువడుతుంది. దీని ఎడిటర్ డోలేంద్రప్రసాద్. 1981 కాలంలో ఆయన సర్పంచిగా పోటీచేస్తే.. ఆయన తరఫున జెండా పట్టుకు తిరిగిన కుర్రవాడు ఇప్పటి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. వారికి అంతటి బంధం ఉంది. కాలక్రమంలో అదికాస్తా చెడింది. కస్తూరిదేవి పాఠశాల నిర్వహణ- జీవీకే సంస్థకు సంబంధించిన వ్యవహారం అందుకు కారణం. ఈ నేపథ్యంలో శ్రీధర్ రెడ్డిని అరాచకశక్తిగా అభివర్ణిస్తూ జమీన్ రైతులో ఒక పెద్ద వార్త ప్రచురితమైంది.
కొన్నిరోజుల తర్వాత.. ఒకరోజు శ్రీధర్ రెడ్డి తన అనుచరులతో తన ఇంటికి వచ్చి కొట్టారనేది డోలేంద్ర ప్రసాద్ కంప్లయింటు. డోలేంద్ర స్వయంగా చెబుతున్న దాన్ని బట్టి ‘తీవ్రంగా దూషించడమూ, కత్తితో పొడుస్తాను కావాలంటే మూడు పేజీల వార్త రాసుకో అనడమూ జరిగింది. ముందు అనుచరులు చేయి చేసుకుంటే, తర్వాత శ్రీధర్ రెడ్డి కూడా చేయి చేసుకున్నారు.’ శ్రీధర్ రెడ్డి చెబుతున్న దాన్ని బట్టి.. ‘ఇంటికి వెళ్లింది నిజం. ఆయన వెంట కేవలం ఇద్దరే ఉన్నారు. వాదులాట, తోపులాట జరిగింది. అంతే తప్ప కొట్టడం జరగలేదు.’
ఒక సంపాదకుడిని కొడితే.. ఎమ్మెల్యే మీద చర్య తీసుకోరా? అని విపక్షాలు, చంద్రబాబు, పవన్ కల్యాణ్ డిమాండ్ చేస్తున్నారు. అది వారి హక్కు. ఇలాంటి సంఘటనల్లో అలాంటి స్పందన విపక్షాల నుంచి ఉండాల్సిందే. అయితే.. ఈ మొత్తం ఘటనకు సాక్షి మరొకరు ఉన్నారు. ఆమె బెంగుళూరులో నివాసం ఉంటున్న డాక్టర్ వసుంధర.
తన ఇంటికి కలవడానికి వచ్చిన వసుంధర తిరిగి వెళుతుండగా, శ్రీధర్ రెడ్డి ఆమెను చేయి పట్టుకుని లాక్కుని తిరిగి ఇంట్లోకి తీసుకువచ్చాడని… డోలేంద్ర చెప్పినట్లుగా కూడా వార్తలు వచ్చాయి. అయితే శ్రీధర్ రెడ్డి మాత్రం.. పోలీసులకు డాక్టర్ వసుంధర ఏం స్టేట్మెంట్ ఇచ్చిందో చూడండి. అందులో నా తప్పని ఉంటే, నిరూపణ అయితే చెప్పండి.. అరెస్టు దాకా అక్కర్లేదు.. నేనే వచ్చి లొంగిపోతా అంటున్నారు. డాక్టర్ వసుంధర పోలీసులకు ఏం చెప్పింది అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేపై ఇదివరకు కూడా వివాదం రేగింది. ఓ జర్నలిస్టును అసభ్యంగా దూషించినట్లు ఆడియో రికార్డింగ్ లు వెలికి వచ్చాయి. ఇప్పుడు ఆరోపణ- ఏకంగా దాడి చేయండం. అయితే వసుంధర అనే డాక్టర్ సీన్ లో ఉన్నట్లు ఇద్దరూ చెబుతున్నారు. ఆమె పోలీసులకు ఏం చెప్పింది.. పోలీసులు ఇంకా ఎందుకు చర్య తీసుకోలేదు.. అనేది తెలియాల్సి ఉంది.