
రెండ్రోజుల కిందట ఏపీలో ముందస్తు అంటూ ఒక ఊహాగానం. ఆ వెంటనే అదిగో కేంద్రం కూడా ముందస్తు.. అంటూ మరో ఊహాగానం! వచ్చే ఏడాది జరగాల్సిన సార్వత్రిక ఎన్నికలు ఈ ఏడాది డిసెంబర్ లోనే జరుగుతాయనే టాక్ ఒకటి చక్కర్లు కొడుతూ ఉంది.
ఏపీలో ముందస్తు అంటూ చంద్రబాబు అండ్ కో మూడేళ్ల నుంచినే ప్రచారం చేస్తూ ఉంది. చంద్రబాబు లెక్కలో అయితే ఏపీలో 2022లోనే ఎన్నికలు అయిపోవాల్సింది! మోడీ పేరు చెప్పి కొన్నాళ్లు అవిగో ఎన్నికలు ఇవిగో ఎన్నికలు అంటూ చంద్రబాబు తన పార్టీ కార్యకర్తలను జూమ్ మీటింగుల్లో వెర్రోళ్లను చేశారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు, నేతలు మాత్రం.. చంద్రబాబుకు వెర్రి అని ఏదేదో మాట్లాడుతూ ఉన్నాడంటూ అప్పట్లోనే విరుచుకుపడ్డారు. ఈ మధ్యకాలంలో అయితే టీడీపీ వైపునుంచి ముందస్తు మాట ఆగిపోయింది. ప్రత్యేకించి రెండు మూడు నెలల నుంచి. ఏపీ సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ రావడానికి మరో పది నెలల సమయం కూడా లేదు. లెక్క ప్రకారం.. వచ్చే ఏడాది మార్చి రెండో వారంలో ఎన్నికల షెడ్యూల్ విడుదల కావాలి.
ముందుగా అంటే.. కనీసం ఇంకో ఐదారు నెలలు అయితే పడుతుంది. ఆ ప్రకారం చూస్తే.. మహా అంటే మూడు నెలల ముందు ఏపీలో ఎన్నికలు జరగొచ్చు. మరి ఏపీలో ఆ మూడు నెలల ముందుకు వెళ్లడానికి అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆసక్తి ఏమిటో తెలియదు కానీ, ఇంతలో ఢిల్లీ నుంచి ముందస్తు ఊహాగానాలు మొదలయ్యాయి.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తీవ్ర నిరాశను మిగుల్చుకున్న భారతీయ జనతా పార్టీ ముందస్తు గురించి ఆలోచిస్తోందనే టాక్ ను తెలంగాణ లో ప్రచారం చేస్తూ ఉన్నారు. కేసీఆర్ ను దెబ్బకొట్టడానికి అంటూ విశ్లేషిస్తున్నారు. అయితే తమ పార్టీ సత్తా ఏమిటో తెలియని తెలంగాణ కోసం బీజేపీ ఏకంగా లోక్ సభ ఎన్నికలను ముందుకు జరుపుతుందనుకోవడానికి మించిన అమాయకత్వం లేదు! అయితే.. ఎలాగూ ఈ ఏడాది చివర్లో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. వాటితో పాటు లోక్ సభ ఎన్నికలు నిర్వహిస్తే ఆ రాష్ట్రాల్లో వాటితో పాటు తెలంగాణలో కూడా కలిసి వస్తుందనే లెక్క కేంద్రానికి ఉందా అనేది సందేహమే!
మోడీ గ్రాఫ్ మునుపటి స్థాయిలో లేదని కర్ణాటక ఎన్నికలు చెప్పకనే చెప్పాయి. రాజస్తాన్ లో అంటే ఎలాగూ ఐదేళ్లకు ఒకసారి అధికారం చేతులు మారుతూ ఉంటుంది. మధ్యప్రదేశ్ లో గనుక బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకోలేకుంటే సౌత్ తో పాటు మధ్యభారతంలో కూడా మోడీ మానియా తగ్గిపోయిందనే ప్రచారానికి ఆస్కారం ఏర్పడుతుంది. కాబట్టి.. ఐదు రాష్ట్రాల ఎన్నికలతో పాటు లోక్ సభ ఎన్నికలు అనే టాక్ కు ఆస్కారం ఉంది.
మరి ఐదు రాష్ట్రాల ఎన్నికలు, లోక్ సభ ఎన్నికలు ఒకేసారి వస్తే.. ఎలాగూ తెలంగాణ ఎన్నికలు వాటితో పాటు ఉంటాయి. మరి లోక్ సభ ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీకి కూడా ఎన్నికలకు వెళ్లడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొగ్గు చూపే అవకాశాలు లేకపోలేదు!
నేను మొక్కలతో, దేముడితో మాట్లాడుతా