Advertisement

Advertisement

indiaclicks

Home > Politics - Gossip

మరికొన్ని గంటల్లో ఫలితాలు.. ఉత్కంఠలో అభ్యర్థులు

మరికొన్ని గంటల్లో ఫలితాలు.. ఉత్కంఠలో అభ్యర్థులు

లక్షలాది మంది అభ్యర్థులు ఆశగా, ఉత్కంఠతో ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. కనీవినీ ఎరుగని రీతిలో భారీఎత్తున చేపట్టిన గ్రామ సచివాలయ ఉద్యోగాల కోసం నిర్వహించిన రిక్రూట్ మెంట్ ఫలితాలు ఈరోజు లేదా రేపు విడుదల కాబోతున్నాయి. అభ్యర్థుల వెయిటేజీ మార్కులకు సంబంధించి 2 శాఖల నుంచి తుదిజాబితా ఇంకా అందకపోవడంతో ఫలితాల వెల్లడిపై చిన్నపాటి ఉత్కంఠ నెలకొంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈరోజే ఫలితాలు వెలువడతాయి.

గ్రామ సచివాలయం పోస్టుల కింద ఏకంగా 19 రకాల ఉద్యోగాల్ని భర్తీచేస్తున్నారు. వీటిలో వీర్వో, సర్వే అసిస్టెంట్, పంచాయతీ సెక్రటరీ గ్రేడ్-5 లాంటి 6 పోస్టులు మినహా.. మిగతా అన్ని ఉద్యోగాలకు వెయిటేజీ మార్కులు కల్పించారు. ఇప్పటికే ఆయా ఉద్యోగాల్లో ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ విధానాల్లో పనిచేస్తున్న వాళ్లకు వెయిటేజీ కల్పించారు. దీనికి సంబంధించిన 2 శాఖల నుంచి ఇంకా తుదిజాబితా సిద్ధంకాలేదు. అది రెడీ అయిన వెంటనే ముఖ్యమంత్రి జగన్ చేతుల మీదుగా ఫలితాలు వెల్లడిస్తారు.

గ్రామ, వార్డు సచివాలయాల్లో ఏకంగా లక్షా 26వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ స్థాయిలో ఉద్యోగాలు భర్తీ చేయడం ఈమధ్యకాలంలో దేశంలో ఇదే తొలిసారి. తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే ఇదొక చరిత్రగా నిలిచిపోనుంది. ఈ ఉద్యోగాల కోసం రాష్ట్రవ్యాప్తంగా 19 లక్షల 74వేల 588 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. మరికొన్ని గంటల్లో వీళ్ల భవితవ్యం తేలిపోనుంది.

అక్టోబర్ 2 నుంచి రాష్ట్రవ్యాప్తంగా గ్రామ సచివాలయాలు ఏర్పాటుకాబోతున్నాయి. ప్రతి జిల్లాలో ఇంచార్జ్ మంత్రులు తమకు నచ్చిన ఊరిలో గ్రామ సచివాలయ ప్రారంభోత్సవానికి హాజరుకావాలని ఇప్పటికే జగన్ ఆదేశాలు జారీచేశారు. తూర్పుగోదావరి జిల్లాలో నిర్వహించే కార్యక్రమంలో జగన్, గ్రామ సచివాలయాన్ని ప్రారంభిస్తారు.

అక్టోబర్ 2 నుంచి రాష్ట్రవ్యాప్తంగా 788 సచివాలయాలు ప్రారంభంకాబోతున్నాయి. వీటిలో 678 సచివాలయాలు పంచాయతీల్లో ఉండగా.. మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల్లో 110 సచివాలయాలు అందుబాటులోకి రాబోతున్నాయి.

సైరా ట్రైలర్ క్రేజ్ ఏ రేంజ్ అంటే.. చూసి తీరాల్సిందే..!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?