Advertisement

Advertisement


Home > Politics - Gossip

'గంట' కొట్టే టైమ్ వచ్చింది, కానీ..!

'గంట' కొట్టే టైమ్ వచ్చింది, కానీ..!

వైసీపీలోకి వలసలు జోరందుకున్నాయి. జిల్లా స్థాయిలో నాయకులు ఈపాటికే సర్దుబాట్లు చేసేసుకున్నారు. ఇంకొంతమంది క్యూలో ఉన్నారు. రాష్ట్రస్థాయి నాయకులు కూడా ఒక్కొక్కరే వలసబాట పడుతున్నారు. టీడీపీ నుంచి జూపూడి వచ్చి కండువా కప్పుకున్నారు, జనసేన నుంచి ఆకుల వచ్చి అల్లుకుపోయారు. అయితే వీరిలో ఎవ్వరూ త్యాగం చేయదగ్గ పదవుల్లో లేరు. వివాదాలు సృష్టించేంత వ్యక్తులూ కాదు. అందుకే వీరి రాకడ ఈజీగా జరిగిపోయింది. ఇక ఇదే ఊపులో టీడీపీకి బైబై చెప్పేందుకు సిద్ధమైపోయారు మాజీమంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. కానీ ఇదంతా ఈజీ కాదనేది అందరికీ తెలిసిన విషయమే.

నియోజకవర్గాలు మారినా, రాజకీయ చతురతతో ఈజీగా నెగ్గే సమర్థత ఉన్న నేత అని గంటాకు పేరుంది. అదే స్థాయిలో విశాఖ భూకుంభకోణాల్లో కూడా ఈయన హస్తముంది. ఇలాంటి టైమ్ లో ఆయన వైసీపీలో చేరక తప్పదు. అందులోనూ టీడీపీ ఐదేళ్ల తర్వాత మరింత క్షీణించే పార్టీయే కానీ, రాణించే పార్టీ కాదని గంటాలాంటి ముందుచూపు గల వ్యక్తులకు బాగా తెలుసు. అందుకే ఆయన వైసీపీలో చేరికకు ఉబలాటపడుతున్నారు.

ఇప్పటికే మూడుసార్లు అధినాయకత్వంతో సామరస్య పూర్వకంగా చర్చలు జరిపారు గంటా. కానీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలనే విషయం ప్రస్తావనకు రావడంతో మిన్నకుండిపోతున్నారు. వైసీపీలో చేరాలంటే ముందు ఎమ్మెల్యే పదవిని త్యాగం చేయాలి, ఆ తర్వాత ఆ పార్టీ టికెట్ పై తిరిగి గెలవగలగాలి. అదంత వీజీ కాదు. అందుకే ఒక అడుగు ముందుకేయడానికి వంద రకాలుగా ఆలోచిస్తున్నారు గంటా. పైగా ఇప్పటికప్పుడు ఆయన వైసీపీలో చేరితే నియోజకవర్గంలో మళ్లీ గెలవడం కష్టం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇన్నాళ్లూ గంటాకు విధేయులుగా ఉన్న పంచకర్ల రమేష్ బాబు లాంటి చాలామంది వ్యక్తులు ఆయనకు రెబల్స్ గా మారే ప్రమాదం ఉంది.

పైగా గంటా వైసీపీలోకి వస్తే ఆహ్వానించడానికి జగన్, విజయసాయిరెడ్డి మినహా ఇంకెవరూ ముందుకరారేమో అనే అనుమానం బలంగా ముంది. ముఖ్యంగా స్థానికంగా వైసీపీలో తీవ్ర వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉంది. ఆకుల, జూపూడి లాంటి బ్యాచ్ వస్తేనే స్థానిక నేతలు గుర్రుగా ఉన్నారని వార్తలొస్తున్నాయి. అలాంటిది గంటా లాంటి విధ్వంసకర బ్యాచ్ రావాలంటే ఇంకెంత రచ్చ జరుగుతుందో అనే అనుమానం కూడా వైసీపీలో ఉంది. గత ఎన్నికల్లో గంటా జస్ట్ 1శాతం ఓటింగ్ షేర్ తో వైసీపీ అభ్యర్థి కన్నపరాజుపై విశాఖ ఉత్తరం నుంచి గెలిచారు.

గంటాకు విశాఖజిల్లా వైసీపీ నేతలందరితోనూ గొడవలున్నాయి. అంటే ముందు గంటా వ్యతిరేక బ్యాచ్ ని, ఆ చుట్టుపక్కల నియోజకవర్గాల వారిని కూడా బుజ్జగించాలి, వారిని ఒప్పించిన తర్వాతే గంటాకి ఆహ్వానం పలకాలి, లేకపోతే అసమ్మతి స్వరాలు మరింత పెరిగే ప్రమాదం ఉంది. వైసీపీ కూడా ఈ విషయంలో తెలివిగానే వ్యవహరిస్తోంది. తన శత్రువుల్ని తానే బుజ్జగించి ఒప్పించుకుంటేనే గంటాను పార్టీలోకి ఆహ్వానిస్తామని కండిషన్ పెట్టిందట. అందుకే ఇటీవల తన వైరి వర్గాన్ని తానే బుజ్జగించే పనిలో పడ్డారు గంటా. అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, మీరు నాకు సపోర్ట్ చేయాలని స్థానిక నేతలతో మంతనాలు జరుపుతున్నారట.

ఇవన్నీ ఓ కొలిక్కి వస్తే టీడీపీలో తొలి ఎమ్మెల్యే వికెట్ గంటాదే అవుతుంది. ఆ ధైర్యంతో మిగతా వారంతా క్యూకట్టే అవకాశం పుష్కలంగా ఉంది. కానీ గంటా శ్రీనివాసరావు అనుకుంటున్నట్టు ఇదంతా ఈజీ కాదు. వైసీపీతో పాటు తనకు రెబల్స్ గా మారుతున్న వ్యక్తుల్ని బుజ్జగించడం అతడికిప్పుడు కత్తిమీద సాముగా మారింది. అలా అని ఎలాగోలా సర్దుకొని టీడీపీలోనే కొనసాగే పరిస్థితులు కూడా కనిపించడం లేదు.

చంద్రబాబుకు ఎందుకు రుచించడం లేదు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?