మొన్నటిదాకా మహారాష్ట్ర గవర్నరుగా సేవలందించిన చెన్నమనేని విద్యాసాగర్ రావు.. మళ్లీ రాజకీయాల్లోకి రాబోతున్నారు. సోమవారం ఆయన తెలంగాణ రాష్ట్ర భాజపా కార్యాలయానికి వచ్చి.. పార్టీ సభ్యత్వం తీసుకుంటారు. సెప్టెంబరు 1వ తేదీన మహారాష్ట్రకు కొత్త గవర్నరు నియామకం జరిగినప్పుడే.. సీహెచ్ విద్యాసాగర్ రావు తిరిగి రాజకీయ పునరాగమనం చేస్తారంటూ గ్రేటాంధ్ర జోస్యం చెప్పింది. ఇవాళ అదే నిజమైంది. ఆయన తిరిగి క్రియాశీల రాజకీయాల్లోకి వస్తున్నారు.
తెలంగాణకు చెందిన సీనియర్ నాయకుడు, గతంలో ఎంపీగా, కేంద్రమంత్రిగా కూడా పనిచేసిన సీహెచ్ విద్యాసాగర్ రావు… కేంద్రంలో మోదీ సర్కారు ఏర్పడినప్పుడు మహారాష్ట్ర గవర్నరుగా అవకాశం సంపాదించారు. ఆయన పదవీకాలం ముగుస్తున్న సమయంలో.. సెప్టెంబరు 1వ తేదీన రాష్ట్రపతి కొత్తగా గవర్నర్ల నియామకం చేపట్టారు. మహారాష్ట్రకు కూడా కొత్త గవర్నరును నియమించారు. తెలంగాణ భాజపా నాయకుల్లో దత్తాత్రేయకు కూడా అవకాశం దక్కింది. ఈ నేపథ్యంలో సీహెచ్ విద్యాసాగర్ రావు పదవీకాలం ముగిసింది.
సెప్టెంబరు 2వ తేదీనాడు గ్రేట్‌ఆంధ్ర డాట్ కామ్ ఓ కథనాన్ని అందించింది. ‘ఆ గవర్నర్.. ఇక క్రియాశీల రాజకీయాల్లోకి’ అనే శీర్షికతో అందించిన ఆ కథనంలో విద్యాసాగర్ రావు మళ్లీ రాజకీయాల్లోకి రానున్న సంగతిని తెలియజెప్పింది. తెలంగాణలో పార్టీ బలోపేతానికి శ్రద్ధ పెడుతున్న అధిష్టానం, ఈ ప్రాంతంలో బలమైన వెలమ సామాజికవర్గానికి చెందిన విద్యాసాగర్ రావును వ్యూహాత్మకంగా తిరిగి రాజకీయాల్లోకి తెస్తుందనే విశ్లేషణను అందించింది.
తెలంగాణలో అధికారంలోకి రావడానికి మార్గం సుగమం చేసుకోవాలని ముచ్చటపడుతున్న భాజపా… అందుకు అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకుంది. వివిధ పార్టీలనుంచి పలువురు నేతలను చేర్చుకుంటున్న తరుణంలోనే.. తమ పార్టీలో ‘ఆఫ్‌లైన్’లో ఉండిపోయిన నాయకులందరినీ కూడా తిరిగి తెరమీదకు తేవడం, తద్వారా పార్టీని బలోపేతం చేసుకోవడంపై భాజపా దృష్టి పెడుతోంది. విద్యాసాగర్ రావు తిరిగి పార్టీ రాజకీయాల్లోకి వస్తుండడంతో.. అది స్పష్టమౌతోంది.