Advertisement

Advertisement


Home > Politics - Gossip

గ్రేటాంధ్ర జోస్యం నిజం : ఆ ఒక్కటి చల్లాకే!

గ్రేటాంధ్ర జోస్యం నిజం : ఆ ఒక్కటి చల్లాకే!

గ్రేటాంధ్ర విశ్లేషణ నిజమైంది. రాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ప్రస్తుతం జరగనున్న ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎవరెవరిని ఎంపిక చేయబోతున్నారనే విషయంలో అంచనాలు యథాతథంగా జరుగుతున్నాయి. రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తూ, ఒకస్థానం కోసం ఉన్న పోటీని తెలియజెప్పేలా, జగన్ ఆ ఒక్కటీ ఇంకా పెండింగ్ లో పెట్టారు.

నిజానికి మూడు ఖాళీలకు ఎన్నికలు జరుగుతున్నప్పటికీ.. ఒక్కదానిని మాత్రమే ఖాళీగా పరిగణించాల్సి ఉంటుందంటూ... ఆగస్టు 2వ తేదీన గ్రేటాంధ్ర ఒక కథనం అందించింది. ‘మూడింటికి ఎన్నికలు : ఖాళీ ఒకటేనా?’ అనే శీర్షికతో ఇచ్చిన ఈ కథనంలో.. మోపిదేవి, ఇక్బాల్ పోగా.. మిగిలిన స్థానాన్ని చల్లా రామకృష్ణా రెడ్డికి కేటాయిస్తారని పేర్కొనడం జరిగింది. ఆ ఒక్క స్థానం కోసం మాత్రమే పార్టీలో బాగా పోటీ నెలకొంది. దానిని చల్లా రామకృష్ణారెడ్డికి కేటాయించే అవకాశం ఉంది.

అసెంబ్లీలో సంఖ్యాబలాన్ని బట్టి మొత్తం మూడు స్థానాలూ వైఎస్సార్ కాంగ్రెస్ కే విధిగా దక్కుతాయి గనుక.. పార్టీలో బాగా పోటీ ఏర్పడింది. మోపిదేవి వెంకటరమణను ఇప్పటికే మంత్రిగా చేసేయడం, ఇఫ్తార్ విందులో ఇక్బాల్ ఖాన్ ను మంత్రిని చేస్తానంటూ హామీ ఇవ్వడం నేపథ్యంలో ఆ రెండూ ఎన్నడో ఖరారైపోయాయి. శనివారం నాడు జగన్ అభ్యర్థుల ప్రకటన కేవలం లాంఛనం మాత్రమే అయింది. అందరి అంచనాల మేరకు ఆ ఇద్దరిపేర్లనే ఆయన ప్రకటించారు. ఆ ఒక్కటీ ఇంకా పెండింగ్ లోనే పెట్టారు.

ఆ ఒక్క స్థానానికి నాయకుల మధ్య పోటీ ఇంకా కొనసాగుతోంది. సీనియర్ల నుంచి ఒత్తిడి ఉన్నది గనుకనే.. జగన్ ఇంకా నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. ప్రస్తుతానికి చల్లా రామకృష్ణారెడ్డికే కట్టబెట్టడానికి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కాకపోతే.. ఇతర సీనియర్లను తృణీకరించినట్లుగా కాకుండా, వారికి స్వయంగా తానే సర్దిచెప్పడం కోసమే.. జగన్ మూడోపేరును ఇంకా ప్రకటించలేదని.. అంతే తప్ప ఎంపికలో మార్పులు ఉండకపోవచ్చునని వైఎస్సార్ కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. 

విపరీత పోకడలకు మోడీ సర్కార్ చెక్ పెడుతోంది

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?