‘‘అశ్వత్థామ హతః’’ అని పెద్దగా అన్నతర్వాత.. ‘‘కుంజరః’’ అని నెమ్మదిగా అన్నందుకు… యావత్ మహాభారతంలో సత్యసంధుడిగా, ధర్మానికి ప్రతీకగా పేరుతెచ్చుకున్న ధర్మరాజు కూడా.. మచ్చ పడ్డాడు. అర్థసత్యాలు చెప్పినంత మాత్రాన.. ఆ సమయానికి పబ్బం గడవవచ్చునేమో గానీ.. నిర్దిష్టమైన శాశ్వత ఉపయోగం ఉండదు. ఇప్పుడు జగన్మోహన రెడ్డి ప్రభుత్వం కూడా తమ పాలన మీద వస్తున్న విమర్శలను తిప్పికొట్టడానికి చాలా ఘనంగా పత్రికలకు విడుదల చేసిన ప్రకటనల్లో.. కొంత భాగం అర్థ సత్యాలు, సందిగ్ధ సత్యాలతో నింపేసింది. దీనివలన ప్రజలకు కొత్త అనుమానాలు కలిగించే, తెదేపా ప్రచారం నిజమే అని నమ్మించే పరిస్థితి ఏర్పడుతోంది.
ఫిబ్రవరి 1వ తారీఖునుంచి ఇంటిద్దకే పెన్షను అందించే పద్ధతిని ప్రభుత్వం అనుసరిస్తోంది. దీనికి సంబంధించి ఆదివారంనాడు పత్రికల్లో ప్రకటనలు ఇచ్చారు. అందులో గత ప్రభుత్వంలో ఇస్తున్న వృద్ధాప్య పెన్షన్ లకు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇస్తున్న పెన్షన్ లకు తేడాలను చూపించారు.
అందులో- ఫిబ్రవరి 1వ తేదీ 2019 వరకు పాత ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్ మొత్తం కేవలం వెయ్యి రూపాయలు కాగా, జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇస్తున్న పెన్షను మొత్తం 2250 అనే సంగతిని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ ప్రకటన చూసిన ఎవరికైనా, జగన్ ప్రభుత్వం 100 శాతం మించి పెన్షన్ పెంచినట్లు గా అనిపిస్తుంది. అయితే సరిగ్గా ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు 1000 రూపాయల పెన్షన్ ను 2000 చేశారు. జగన్ సర్కారు దానిని పరిగణనలోకి తీసుకోలేదు. జగన్ – పెన్షన్ పెంపు గురించి పాదయాత్రలో హామీ ఇచ్చిన నేపథ్యంలో, దానిని ఎదుర్కోవడానికి అప్పట్లో సరిగ్గా ఎన్నికల గంట మోగడానికి ముందుగా చంద్రబాబు వెయ్యి రూపాయల పెన్షన్ పెంచారు. కాబట్టి దానిని జగన్ ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోకపోవడం లో అర్థం ఉంది, సబబే.
అయితే పెన్షన్ లబ్ధిదారుల సంఖ్య విషయానికి వచ్చేసరికి 2018 ఫిబ్రవరి 1వ తారీఖున గడువుగా ఈ ప్రకటనలో సర్కారు తీసుకున్నది. అప్పటికీ కేవలం 44 లక్షల మంది లబ్ధిదారులు ఉండగా, ఇప్పుడు 58.99 లక్షల మందికి పెన్షన్లు అందుతున్నాయని ప్రకటనలో పేర్కొన్నారు.
2019లో తెలుగుదేశం పాలన ముగిసేనాటికి పెన్షన్ లబ్ధిదారులు ఎంత అనే సంగతిని దాచి ఉంచారు. అసలే జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్ లబ్ధిదారుల పేర్లు జాబితాలో నుంచి తొలగిస్తున్నారని తెదేపా నుంచి అనేక ఆరోపణలు వస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో 2018 తో పోల్చి, తాజాగా 59 లక్షల మందికి ఇస్తున్నట్లుగా ప్రభుత్వం చెబుతోంది. అయితే ఈ సంఖ్య 2019 తో పోలిస్తే తక్కువే ఉంటుందని, లబ్ధిదారుల తొలగింపు నిజమే కావచ్చు అనిపించేలా ప్రకటన ఉంది.
అనర్హులను జాబితా నుంచి తొలగిస్తే ఆ విషయాన్ని దాచవలసిన అవసరం లేదు. జాబితాలో లేకుండా ఎవరైనా మిగిలిపోయి ఉంటే గనుక, కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ప్రకటించిన ప్రభుత్వం, ఆరోపణలకు జడుసుకుని అర్ధ సత్యాలను ప్రకటనలో పేర్కొనడం ఎందుకో అర్థం కాని సంగతి.
అసిస్టెంట్ డైరెక్టరుగా ఉన్నపుడే ప్రొడ్యూసర్స్ పై కంప్లైంట్ ఇచ్చేవాడు