అధికారంలోంచి దిగిపోయిన తర్వాత.. దానికి తగినట్లుగా తనకు సెక్యూరిటీ తగ్గించినందుకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎంత గగ్గోలు పెట్టారో అందరికీ తెలుసు. తన ప్రాణాలకు భద్రత లేకుండా చేయడానికి, తనను అంతమొందించడానికి జగన్ కుట్ర పన్నుతున్నారనే వ్యాఖ్యలు కూడా చేశారు. ఆ విషయం మీద ఆయన హైకోర్టుకు కూడా వెళ్లారు. ఎంతచేసినా.. ఆయన అడిగినట్లుగా స్థాయికి మించి సెక్యూరిటీ ఇవ్వడానికి హైకోర్టు ఒప్పుకోలేదు.
అంత యాగీచేసి ఆయన ఏమీ సాధించలేదు. ఇప్పుడు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు కూడా సెక్యూరిటీ తగ్గించారు. కానీ, ఆయన మాత్రం.. దాని గురించి చంద్రబాబు లాగా ఎలాంటి గోలా చేయరుగాక చేయరు అని నాయకుల్లో సరదాగా చర్చ జరుగుతోంది. ప్రధానులకు, ఆ స్థాయిలోని కీలక వ్యక్తులకు స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) భద్రత ఉంటుంది. మాజీ ప్రధానులకు కూడా ఇది కొనసాగుతుంది. అలాగని మాజీ ప్రధానులకు దాన్ని తొలగించడం జడ్ ప్లస్ మాత్రం కొనసాగించడం కూడా జరుగుతుంటుంది.
ఆ క్రమంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు గత అయిదేళ్లూ ఉన్న ఎస్పీజీ భద్రతను ప్రభుత్వం తొలగించి, జడ్ ప్లస్ మాత్రం పరిమితం చేసింది. కొందరికి మాత్రం ఈ ఎస్పీజీ కొనసాగుతూనే ఉంటుంది. వాజపేయి, ఆయన దత్తకుమార్తెకు కూడా దీనిని కొనసాగించారు. అయితే ఇప్పుడు తనకు భద్రత తగ్గించడం గురించి మన్మోహన్ వైపు నుంచి ఎలాంటి కామెంట్లు రాలేదు. ఆయన కామెంట్ చేసే అవకాశం కూడా లేదు.
మన్మోహన్ సింగ్ అంటే ఒక గౌరవప్రదమైన రాజనీతిజ్ఞుడు. 2014 వరకు ఆయన ప్రధానిగా ఉన్న కాలంలో.. ఆయన భార్య, కుమార్తెలకు కూడా ఎస్పీజీ భద్రత ఉండేది. అప్పుడు ఆయన మాజీ కాగానే.. తమకు అసలు ఎలాంటి భద్రత అవసరం లేదని.. వారు దానిని ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేశారు. మన్మోహన్ కు ఇప్పటిదాకా ఎస్పీజీ కొనసాగించి, ఇక జడ్ ప్లస్ చేయనున్నారు. అయినా పర్లేదని, ఆయనకు భద్రత భయాలు లేవని సన్నిహితులు చెబుతున్నారు.
నిజానికి భయం ఎలా ఉన్నా.. భద్రత హంగామాను నాయకులు ఒక స్థాయికింద భావిస్తారు. చంద్రబాబు తన భద్రత తగ్గించినప్పుడు గోలచేసింది కూడా అందుకే. కానీ కోర్టు పట్టించుకోలేదు. మన్మోహన్ మాత్రం.. ఈ విషయంలో ఎలాంటి గోల చేయకుండా.. చాలా హుందాగా వ్యవహరించడం విశేషమే.