దావా వేయకుంటే.. ఆ వార్త నిజమన్నట్టే!

రాజకీయ నాయకులు తమ మీద ఆరోపణలు వచ్చినప్పుడు.. తక్షణం తమను తాము డిఫెండ్ చేసుకోవడానికి ఏదో ఒక ప్రతిసవాళ్లు విసురుతూ ఉంటారు. అప్పటికప్పుడు ప్రజల దృష్టి మరల్చడానికి ఆరోపణలను మించిన డైలాగులు సంధిస్తుంటారు. అయితే..…

రాజకీయ నాయకులు తమ మీద ఆరోపణలు వచ్చినప్పుడు.. తక్షణం తమను తాము డిఫెండ్ చేసుకోవడానికి ఏదో ఒక ప్రతిసవాళ్లు విసురుతూ ఉంటారు. అప్పటికప్పుడు ప్రజల దృష్టి మరల్చడానికి ఆరోపణలను మించిన డైలాగులు సంధిస్తుంటారు. అయితే.. ఆ మాటలు ఆ తర్వాతి కాలంలో సహజంగా నిలబడవు. ఆలోగా ప్రజలు ఈ వ్యవహారాల్ని మొత్తం మరచిపోతారు. అలా కాకుండా.. ఘాటైన సవాళ్లు విసిరినప్పుడు వాటికి కట్టుబడి ఉండకపోతే గనుక.. వచ్చిన ఆరోపణల్ని వారు అంగీకరిస్తున్నట్లే భావించాల్సి ఉంటుంది.

అవును ఇదంతా.. తెలంగాణ ప్రభుత్వం మీద.. వచ్చిన అవినీతి ఆరోపణలు.. పోలీసు శాఖలో బదిలీల వ్యవహారంగురించి వచ్చిన కథనాల గురించే. ఈనాడులో తెలంగాణ పోలీసుశాఖ మీద శనివారం నాడు ఓ కథనం ప్రచురితమైంది. ‘దొంగలతో దోస్తీ’ శీర్షికతో దీనిని ప్రచురించారు. కొందరు నేరగాళ్లతో పోలీసు అధికారులు కుమ్మక్కయి భారీగా అవినీతికి పాల్పడుతూన్నారనేది కథనం. పోలీసు శాఖలో బదిలీలు అన్నీ కూడా రాజకీయ ప్రమేయంతోనే జరుగుతున్నాయని కూడా అందులో పేర్కొన్నారు.

సహజంగానే పోలీసు ఉన్నతాధికారులు ఈ కథనాన్ని ఖండించారు. తెలంగాణ పోలీసు శాఖకు దేశవ్యాప్తంగా ఎంతటి కీర్తి ప్రతిష్టలు ఉన్నాయో చాటిచెప్పే ప్రయత్నం చేశారు. పత్రికలు తప్పుడు కథనాలు ఇవ్వకూడదంటూ  హితవు చెప్పారు. ఇదంతా ఓకే.. హోంమంత్రి మహమూద్ ఆలీ  కూడా ఈ కథనంపై స్పందిస్తూ ఏమాత్రం బాధ్యత లేకుండా ప్రచురించిన ఈ కథనం మీద.. వెయ్యి కోట్ల రూపాయలకు ఈనాడు మీద పరువు నష్టం దావా వేస్తామని ప్రకటించారు.

ఇక్కడే ఉంది అసలు కీలకం… తమ మీద వచ్చిన ఆరోపణల పైనుంచి ప్రజల దృష్టి మరల్చడానికి ఏదో ఆపత్సమయానికి ఈ వెయ్యకోట్ల దావా డైలాగు వేశారా? లేదా, నిజంగానే… వేస్తారా అనేది ప్రశ్న. దావా వేయకపోతే గనుక.. ఈనాడు కథనంలో ఉన్న ఆరోపణల్ని మంత్రి ఒప్పుకనునట్టే భావించాల్సి ఉంటుంది. పరువు నష్టం దావా వేస్తే గనుక.. పత్రికల్లో తప్పుడు కథనాలు రాసే వారికి అది ఒక హెచ్చరికగా ఉంటుంది.