ఆంధ్రప్రదేశ్ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు అలియాస్ కొడాలి నాని.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులైన పార్టీ నాయకుల్లో ఒకరు. తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ కు వీరాభిమాని, హీరో ఎన్టీఆర్ కు సన్నిహితుడు అయిన కొడాలి నాని వైకాపాలో కీలక నాయకుడే. కనుకనే… మంత్రి కూడా అయ్యారు. ఆయన గురువారం నాడు ఓ సంచలన ప్రకటన చేశారు. జగన్మోహన రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరచేందుకు కుట్ర జరుగుతున్నదంటూ ఆయన వ్యాఖ్యానించారు.
కొడాలి నాని అంటే రాష్ట్ర ప్రజలకు ఇప్పటిదాకా ఒకటే గెటప్ గుర్తుకు వస్తుంది. బాగా పెరిగిన గడ్డంతో కనిపించే నానిని మాత్రమే జనం గుర్తుపట్టగలరు. రాజకీయాల్లోకి రాకముందు కూడా ఆయన గెటప్ అలాగే ఉండేది. అలాంటి నాని.. గురువారం తిరుమలకు వెళ్లి.. తలనీలాలు సమర్పించారు. ఆయన తిరుమలలోనే మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రకటన చేశారు. జగన్ ప్రభుత్వాన్ని అస్థిరపరచేందుకు కుట్ర జరుగుతోందంటూ కొడాలి నాని ప్రకటించారు.
నాని మాటలను ఆషామాషీగా తీసుకోవడానికి వీల్లేదు. ఇలాంటి మాటలు ఇదివరకు కూడా కొన్ని సందర్భాల్లో వేర్వేరు నాయకులతో మాటల్లో వినిపించాయి. అయితే అవి నిజాలని నమ్మబుద్ధి కాలేదు. ఎందుకంటే.. 175 సీట్లుండే అసెంబ్లీలో 151 సీట్లతో తిరుగులేని ఆధిపత్యం కలిగిఉన్న పార్టీ నాయకుడి జగన్ సీఎం కుర్చీలో ఉన్నారు.
ఆ పార్టీ ఎమ్మెల్యేల్లో ప్రతి ఒక్కరికీ కూడా… తాము కేవలం జగన్ వల్లనే గెలిచామనే స్పృహ ఉంది. అలాంటి నేపథ్యంలో ఆయన మీద తిరుగుబాటు చేసి.. పార్టీ వీడడానికి సాహసించే వారు 1-2 శాతం కూడా ఉండకపోవచ్చు. మరి దాదాపు యాభైశాతం వరకు పార్టీని వీడిపోతే తప్ప ప్రభుత్వం అస్థిరం కాదు. ఇలాంటి విశ్లేషణలవల్ల అలాంటి అనుమానాలన్నీ చెత్త విశ్లేషణలు అనిపించింది.
కానీ ఇవాళ ఏకంగా ప్రభుత్వంలోని మంత్రి, జగన్ కు అత్యంత సన్నిహితుల్లో ఒకరైన కొడాలి నాని, ప్రభుత్వ అస్థిరతకు కుట్ర జరుగుతోందని అనడం చిన్న సంగతికాదు. నిజంగానే కుట్ర జరుగుతోందా? ఆవిషయం జగన్ దృష్టిలో కూడా ఉందా? దాన్ని ఆయన ఎలా ఎదుర్కోదలచుకున్నారు.. అనే సంగతుల్లో మాత్రం స్పష్టతలేదు.