జగన్ కు ఈ దెబ్బ తగలాల్సిందే

యుద్దం యుద్దంలా చేయాలి. యుద్దంలో యోగాసనాలు వేయకూడదు. యుద్దంలో ప్రత్యర్థిని తక్కువ అంచనా వేయకూడదు. కానీ ముఖ్యమంత్రిగా, ఓ పార్టీ అధ్యక్షుడిగా జగన్ ఈ మూడు పనులు చేసారు. రాజకీయ యుద్దాన్ని యుద్దంలా కాకుండా,…

యుద్దం యుద్దంలా చేయాలి. యుద్దంలో యోగాసనాలు వేయకూడదు. యుద్దంలో ప్రత్యర్థిని తక్కువ అంచనా వేయకూడదు. కానీ ముఖ్యమంత్రిగా, ఓ పార్టీ అధ్యక్షుడిగా జగన్ ఈ మూడు పనులు చేసారు. రాజకీయ యుద్దాన్ని యుద్దంలా కాకుండా, ఏదో మార్చేద్దాం, ఏదో చేసి చూపిద్దాం అనుకున్నారు జగన్. నిజానికి స్థానిక ఎన్నికలు నిర్వహించడం అంటే చంద్రబాబుకు చాలా ఇబ్బంది కరమైన పని. అందుకే ఆ పనికి ఆయన ఎప్పుడూ దిగలేదు. 

2014కు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం అమాయకంగా ముందు వెనుక ఆలోచించకుండా స్థానిక ఎన్నికలు నిర్వహించి, చంద్రబాబుకు వీలయినంత సాయం చేసింది. మళ్లీ చంద్రబాబు మాత్రం ఆ పని చేయలేదు. చంద్రబాబు చేయని పనిని చేయాలని తలకెత్తుకున్నారు జగన్. స్థానిక ఎన్నికల విషయంలో జనం ఒక విధంగా ఆలోచిస్తారు. అయిదేళ్లు ఎమ్మెల్యేతో గ్రామాలకు నిధులు తెచ్చుకోవాలి. పనులు చేయించుకోవాలి. అవసరం అయితే ఆ ఎమ్మెల్యే దగ్గరకు వెళ్లాలి. ఇవన్నీ చేయాలంటే ఎమ్మెల్యే ఏ పార్టీ అయితే ఆ పార్టీనే గెలిపించాలనుకునంటారు.

సాధారణంగా నూటికి ఎనభై శాతం గ్రామాల జనాలు ఇలాగే ఆలోచిస్తారు. అదే సమయంలో ప్రతిపక్షం లో వున్నవారు ఖర్చుకు వెనుకాడతారు, అధికారపక్షంలో వున్నవారు ఖర్చుకు ముందుకువస్తారు. ఇలా అన్ని విధాలా స్థానిక ఎన్నికలు ఎక్కువగా అధికారపక్షానికే ఎక్కువ అనుకూలంగా వుంటాయి. అయినా కూడా వాటిని జరపడానికి బాబుగారికి ఎప్పుడూ జంకే. 

ఇలా మొత్తానికి ఎన్నికలకు జగన్ సై అనగానే చంద్రబాబు సమస్యను పసిగట్టారు. ఇప్పుడు ఈ ఎన్నికల్లో సహజంగా వైకాపా డామినేట్ చేస్తే, తెలుగుదేశం పార్టీకి కష్టం. ఇక్కడే చంద్రబాబు తన అనుభవాన్ని రంగరించి వ్యూహరచన చేసారు. ఎన్నికల నామినేషన్ పర్వం ప్రారంభమైన నాటి నుంచే ఎక్కడైతే ఎన్నికలు అనేవి ఎప్పుడూ ఘర్షణ పూరితంగా వుంటాయో, ఆ ప్రాంతాలను టార్గెట్ చేసారు. బాబుగారి మీడియా కూడా వాటిమీద గట్టి దృష్టి పెట్టింది. 

వైకాపా జనాలు నేరుగా వెళ్లి ఆ వ్యూహంలో చిక్కుకున్నారు. ఆ మీడియా అంతే ఎప్పుడూ చేసే గడబిడే అనుకున్నారు. కేవలం పలనాడు, అనంతపురం, కర్నూలు చిత్తూరు ఇలా మూడు నాలుగు ప్రాంతాల్లో జరిగిన గడబిడలను గ్లోరిఫై చూపించి, అసలు ఆంధ్రలో ప్రభుత్వమే లేదనిపించేసారు. బీహార్ మాదిరిగా తయారైందనిపించారు. ఇదంతా చూసి వైకాపా తేదేపా వ్యూహాన్ని తప్పు అంచనా వేసుకుంది. ఎన్నికల్లో ఓడిపోతే, దౌర్జన్యంగా గెలిచారు అని ముద్రవేయడానికి ఇదంతా చేస్తోంది తెలుగుదేశం పార్టీ అనుకున్నారు. పార్టీ జనాలు వారి పని వారు చేసుకుంటున్నారు, తెలుగుదేశం పార్టీ, దాని అనుకూల మీడియా గోల చేస్తుంది తప్ప ఇంకేం వుంటుదనుకున్నారు.

అంతే తప్ప తెలుగుదేశం పార్టీ అసలు వ్యూహాన్ని అంచనా వేయలేకపోయారు. జనం దృష్టిలో శాంతిభద్రతలు అడుగంటాయి అనే కలర్. అదే సమయంలో కోర్టులో కేసులు. అధికారులను ఇరుకున పెట్టేపనులు చేపట్టారు. సరిగ్గా ఆదివారం నాడు తెలుగుదేశం అనుకూల మీడియాలో ఘాటైన వ్యాసం వచ్చింది. దాదాపుగా ఎన్నికల కమిషనర్ కు సిగ్గులేదా అని ప్రశ్నించినంత పని చేసారు. సరిగ్గా ఇది బయటకు వచ్చిన కొన్ని గంటల తరువాత ఎన్నికల అధికారిగా ఎన్నికల వాయిదా నిర్ణయం తీసుకున్నారు.

ఇప్పుడు దీనిని ఎవ్వరూ తప్ప పట్టలేరు. ఇప్పటిదాకా తెలుగుదేశం పార్టీ వెల్ ప్లాన్డ్ గా ప్రిపేర్ చేసిన గ్రౌండ్ అలాంటిది. నిజానికి ఇప్పడు జగన్ బాధపడాల్సింది ఎన్నికలు వాయిదాపడినందుకు కాదు. రావాల్సిన నిధులు ఆగిపోయాయి . అది దేశం అసలు వ్యూహం. నిధులు రాకపోతే జగన్ ఏం చేస్తారన్నది ఆ పార్టీ అసలు పాయింట్.

జగన్ ఇప్పుడు చేయాల్సింది ఎన్నికల కమిషన్ ను సాధించడం కాదు, కేంద్రంలో తనకు వున్న అనుబంధం ఉపయోగించి నిధులు తెచ్చుకోవడం. ఎన్నికలు జరగకపోయితే వచ్చిన నష్టం లేదు. కానీ నిధులు రాకపోతే నష్టం. అందువల్ల జగన్ అటు దృష్టి పెట్టాలి.

ఇదే సమయంలో జగన్ ఇంకో పని చేయాల్సి వుంది.  పార్టీలోకి వస్తామంటున్న వారి విషయంలో జగన్ ఆచి తూచి వ్యవహరిస్తున్నారు. నిజానికి ఎటువంటి శషభిషలు లేకుండా జగన్ పార్టీ తలుపులు తెరిస్తే, తెలుగుదేశం వ్యవహారం ఇలా వుండదు. ఆ పని ముందు చేసి, ఆ తరువాత ఎన్నికలకు వెళ్లి వుండాల్సింది. కానీ అలా చేయకుండా, ఏవేవో పద్దతులు, నియమాలు అంటూ వెళ్లారు.

అయితే ఇదంతా జగన్ కు ఓ విధంగా అదృష్టమే. ఎందుకంటే మొదటి ఏడాదే తెలుగుదేశం ఎత్తులు, జిత్తులు అన్నీ అనుభవంలోకి వచ్చేస్తే, రాబోయే నాలుగేళ్లలో జాగ్రత్త పడవచ్చు. తెలుగుదేశం వ్యూహాలు ఎంత దూరం నుంచి ఎక్కడ టార్గెట్ చేస్తాయో అర్థం అయింది కాబట్టి, ఇంకా తెలివిగా వుండొచ్చు. 

ఎందుకంటే యుద్దం యుద్దంలా  చేయాలి. అవసరమైతే అశ్వద్దామ హత: కుంజరహ: అనాలి. శతృవుకు శల్య సారథ్యం అందేలా చేయాలి. అవసరమైతే శిఖండిని అడ్డం పెట్టుకోవాలి. అంతే తప్ప, నీతి, నిజాయతీ, అంటూ వెళితే ఇలాగే తల బొప్పి కడుతుంది. కొన్ని యుగాల కిందటే కురుక్షేత్రం ధర్మ బద్దంగా జరగలేదు. ఇవ్వాళ రాజకీయాలు ధర్మ బద్దంగా చేయాలని జగన్ అనుకుంటే సరిపోదు. పార్టీ జనాలు అనుకోవాలి. ప్రతిపక్షాలు అనుకోవాలి. 

ఈ విషయం జగన్ ఎంత త్వరగా తెలుసుకుంటే అంత మంచింది.