రాజధాని వివాదం అనేది రోజురోజుకూ ముదురుతోంది. అమరావతి నుంచి రాజధానిని తరలించడానికి వీల్లేదంటూ రైతులు ఆందోళనలు చేస్తున్నారు. జగన్ ప్రభుత్వం, తదనుగుణంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం.. అధికార వికేంద్రీకరణ గురించి.. మూడు ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయడం గురించి అందులో ప్రజలకు జరుగుతున్న న్యాయం గురించి మాట్లాడుతున్నారు. అయితే రాజధాని- అభివృద్ధి అనే అంశాలకు సంబంధం లేకుండా.. అనేక మంది జగన్ సర్కారులోని మంత్రులు.. అర్థం పర్థంలేని, పసలేని మాటలు మాట్లాడుతూ ప్రజల దృష్టిని పక్కకు మళ్లిస్తున్నారు.
రాజధాని అనేది రాష్ట్ర పరిపాలనకు సంబంధించిన వ్యవహారం. అభివృద్ధికి సంబంధించిన వ్యవహారం. మూడు రాజధానుల ప్రతిపాదన అనేది.. రాష్ట్ర ప్రగతికి ఏ రకంగా బాటలు వేస్తుందో మాత్రమే ప్రభుత్వ లోని వ్యక్తులు చెప్పాలి. తమ వాదనతో ప్రజల ఆమోదాన్ని పొందగలగాలి.
కానీ… జగన్ మంత్రులు.. అమరావతి ప్రాంతంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగింది.. అక్రమాలకు పాల్పడ్డారు అని మాట్లాడడం పరిపాటి అయిపోయింది. ఇలాంటివి ప్రతి సర్కారులోనూ జరుగుతాయి. ఇప్పుడు వీరు అధికారంలో ఉన్నారు గనుక.. అక్రమాలు జరిగి ఉంటే.. విచారణ జరిపించాలి. అంతే తప్ప.. జాబితా బయటపెడతాం.. అంటే గత ఏడునెలలుగా పసలేని మాటలతో పొద్దుపొచ్చుతున్నారు. నిజంగా అవినీతి జరిగి ఉంటే ఈ పాటికి విచారణకు ఆదేశించి అక్రమాలు తేల్చి.. వారు చెబుతున్నట్లుగా తెదేపా నాయకులు తప్పు చేసి ఉంటే వారికి శిక్షలు కూడా విధించేస్తే సరిపోయేది.
కానీ ఇంతకాలంగానూ… ఇన్ సైడర్ ట్రేడింగ్ గుట్టు బయటపెడతాం అంటూ కాకమ్మ కబుర్లు మాట్లాడుతుండడం వల్ల.. రాజధాని అనే అంశానికి సీరియస్నెస్ తగ్గుతోంది. ఇన్ సైడర్ ట్రేడింగ్ వల్ల రాజధానిని మారుస్తున్నారా… వికేంద్రీకరణ ప్రజలకు మేలు చేస్తుందనే ఉద్దేశంతో మారుస్తున్నారా? అనేది ప్రజలకు కొత్త అనుమానాలను కలిగిస్తోంది. చేతనైతే జాబితాలు బయటపెట్టాలి, అక్రమాలు తేల్చాలే తప్ప.. జాబితాలు బయటపెడతాం.. సంగతి చెబుతాం వంటి పసలేని మాటలతో.. వైకాపా మంత్రులు పొద్దుపుచ్చడం అవివేకంగా కనిపిస్తోంది.