కేసీఆర్ బుట్టలో జగన్ పడకూడదు!

‘గోదావరి జలాలను రాయలసీమకు తరలించడం’ అనే వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్‌గా ఉంది. గోదావరి జలాలను శ్రీశైలం వరకు కాలువల ద్వారా తీసుకువెళ్లి… అక్కడినుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా రాయలసీమ జిల్లాలకు పంపుకోవచ్చుననేది…

‘గోదావరి జలాలను రాయలసీమకు తరలించడం’ అనే వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్‌గా ఉంది. గోదావరి జలాలను శ్రీశైలం వరకు కాలువల ద్వారా తీసుకువెళ్లి… అక్కడినుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా రాయలసీమ జిల్లాలకు పంపుకోవచ్చుననేది ప్రతిపాదన. దీనికోసం ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇవాళ (సోమవారం) హైదరాబాదులోని కేసీఆర్ నివాసంలో సమావేశం అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రం.. కేసీఆర్ మాయలో జగన్ పడకూడదని కోరుకుంటున్నారు.

తాను కొత్తగా అధికారంలోకి వచ్చిన తర్వాత.. జగన్ తీసుకున్న పలు నిర్ణయాలు తెలంగాణకు అనుకూలమైనవి అని.. కేసీఆర్ తో మైత్రికోసం తహతహలాడుతూ అలాంటి నిర్ణయాలు తీసుకున్నారని ఒక ప్రచారం జరిగింది. అదంతా దుష్ప్రచారమే అనాలి. ఎందుకంటే.. హైదరాబాదులోని సెక్రటేరియేట్ భవనాలను ఏపీ వాడుకోకుండా… తన అధీనంలో ఉంచుకున్నంత మాత్రాన సాధించేది శూన్యం. వాటిని తెలంగాణకు అప్పగించేయడం వలన మనం కోల్పోయేది లేదు. 9,10 షెడ్యూళ్లలోని ఇతర ఆస్తుల పంపకాలన్నీ పూర్తికానంత వరకు వాటిని కూడా అప్పగించకుండా.. అట్టే పెట్టుకోవడం జరిగింది గానీ… ఆ షెడ్యూళ్ల ఆస్తుల పంపకం గురించి.. ఇరువురు ముఖ్యమంత్రులు సూత్రప్రాయంగా అనుకున్న తర్వాత.. సెక్రటేరియేట్ భవనాలను ఇచ్చేయడంలో తప్పులేదు. దానిపై ఎంత దుష్ప్రచారం సాగినా ప్రజలు అర్థం చేసుకోగలరు.

కానీ.. గోదావరి జలాలను రాయలసీమకు తరలించడం అనే ముసుగులో జరుగుతున్నది వేరు. ఈ మిష మీద శ్రీశైలం డ్యాం వరకు కాలువలు తవ్వితే.. తెలంగాణలోని అనేక ప్రాంతాలకు సాగునీటి ఇక్కట్లు తీరిపోతాయి. సమస్తం సస్యశ్యామలం అయిపోతుంది. అది మంచిదే. పోతిరెడ్డిపాడు నుంచి రాయలసీమ జిల్లాలకు వెళ్లగల నీటికంటె.. తెలంగాణ వాడుకునేదే ఎక్కువ ఉంటుంది. ఎవరు వాడుకుంటున్నారనేది ఇక్కడ సమస్య కాదు. తెలంగాణ వాడేసుకోవడాన్ని అడ్డుకోవాలన్నది కూడా ఆలోచన కాదు. కానీ.. లబ్ధి ఎక్కువగా తెలంగాణకు జరుగుతున్నప్పుడు.. కాగల వ్యయాన్ని ఏపీ ప్రభుత్వం తగుమాత్రంలోనే పంచుకోవాలి.

రాయలసీమకు గోదావరి నీళ్లు ఇవ్వడం అనేది ఏపీ ప్రభుత్వానికి దుర్లభమేమీ కాదు. లోక్‌సత్తా జయప్రకాష్ నారాయణ్ చెప్పిన మేరకు.. పులిచింతల కాస్త ఎత్తు పెంచుకుని.. పట్టిసీమనుంచి తరలించే గోదావరి జలాలను నింపుకుని.. చిన్న ఎత్తిపోతల ఏర్పాటు చేసుకుంటే.. శ్రీశైలంనుంచి తమ వాటా జలాలను మొత్తం రాయలసీమకే పంపుకోవచ్చు. చిన్నవ్యయంతో అదే ప్రయోజనం నెరవేరుతుంది. కేసీఆర్ తో ప్రతిపాదనల్లో అంతకుమించి భారీ వ్యయానికి ఏపీ వాటాగా భరించడానికి జగన్ ప్రభుత్వం ఒప్పుకుంటే తప్పులో కాలేసినట్లు అవుతుంది.

ఇలాంటి పథకం వలన ప్రధాన లబ్ధి తెలంగాణకే జరుగుతుంది. ఏపీ ప్రభుత్వం మద్దతిస్తే మంచిదే. వారి ఆలోచనకు భారీ వ్యయం అవుతుంది. ఆ వ్యయాన్ని జగన్ ప్రభుత్వం మోయడం అనవసరం. అలాకాకుండా.. ఈ పథకం మొత్తం రాయలసీమకు గోదావరి నీళ్లివ్వడానికే అన్నట్లుగా మాయ చేసినట్లయితే.. భారం, బాధ్యత కూడా ఏపీ ప్రభుత్వం మీదనే మోపవచ్చుననేది  కేసీఆర్ వ్యూహం అయితే గనుక, ఆ బుట్టలో పడకుండా జగన్ జాగ్రత్త తీసుకోవాలి.

సినీ ఇండస్ట్రీలో ఈ ఫీలింగ్స్‌ మరింత ఎక్కువ