పార్టీల్లో సర్వాధికారాలు చెలాయించే కీలక నాయకుడు ఒకరైతే.. వారికి ముఖ్య అనుచరుడిగా అన్నీ తానై వ్యవహరించే నెంబర్ టూ నాయకులు ఉంటారు! జనసేన విషయానికి వస్తే.. ఆ స్థానం నాదెండ్ల మనోహర్ ది! ఆ పార్టీలో దక్కుతున్న ప్రాధాన్యం గమనిస్తే.. కేవలం ‘నెంబర్ టూ’ కాదు.. ఆయన ‘నెంబర్ టూ ప్లస్’ అని కూడా మనకు అనిపిస్తుంది. అలాంటి నాదెండ్ల మనోహర్.. జనసేన పార్టీని తిరిగి తన మాతృసంస్థ అయిన కాంగ్రెస్ పార్టీ గూటికి తీసుకెళ్లే ఆలోచనల్లో ఏమైనా ఉన్నారా? లేదా, తనలోని గాఢమైన కాంగ్రెస్ పార్టీ మూలాలను ఆయన ఇంకా విస్మరించలేకపోతున్నారా? అనే అనుమానం తాజాగా ఆయన మాటలు గమనిస్తే కలుగుతోంది.
జనసేన పార్టీకి ఇటీవలి కాలంలో రెండు మూడు గట్టి విషయాలు తగిలాయి. రోడ్ల మరమ్మతులు లాంటివి రెగులర్ రాజకీయ గిమ్మిక్కులకు తోడు.. కౌలు రైతులకు సాయం చేయడం అనే మంచి కార్యక్రమాన్ని పార్టీ చేపట్టింది. దీనివెనుక రాజకీయకోణాలు ఎన్నయినా ఉండవచ్చు గానీ ఆ పని వల్ల చాలా మందికి మేలు జరుగుతోంది. అయితే కౌలు రైతులకు తాము సొంత డబ్బు కోట్లకు కోట్లు ఇచ్చేస్తున్నాం అనే విషయాన్ని బహుధా ప్రచారం చేసుకోవడానికి జనసేన ఉత్సాహపడుతోంది.
ఎవరైనా తాము చేసిన మంచి పనిని మరింతగా ప్రచారం చేసుకుని.. ఓట్లుగా మార్చుకోవాలని ఆశపడతారు. తప్పుపట్టక్కర్లేదు. కానీ.. పవన్ కల్యాణ్ కష్టపడి సంపాదించిన లేదా విరాళాలు సేకరించిన డబ్బులతో కౌలు రైతులను ఆదుకుంటూ.. మధ్యలో కాంగ్రెస్ పార్టీకి కీర్తిప్రతిష్టలను కట్టబెట్టడానికి ఈ మాజీ కాంగ్రెస్ నాయకుడు మనోహర్ ఎందుకు తపన పడుతున్నారో అర్థం కాని సంగతి.
కౌలురైతుల కోసం గతంలో కాంగ్రెస్ పార్టీ ఒక మంచి చట్టాన్ని తీసుకువస్తే.. ఈ ముఖ్యమంత్రి దాన్ని నిర్వీర్యం చేసేస్తున్నారంటూ.. నాదెండ్ల మనోహర్.. తాజాగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా ఇలా తెలుగుదేశం పార్టీ చెప్పుకోవాలి. మా హయాంలో అంత అద్భుతంగా చేస్తోంటే.. ఈ ప్రభుత్వం నాశనం చేసింది అనాలి. కానీ.. జనసేన పార్టీకి అలా చెప్పుకోవడానికి ఏం లేదు. పవన్ కల్యాణ్ ప్రభుత్వం మీద రంకెలు మాత్రమే వేస్తుంటారు. కానీ నాదెండ్ల.. ఎంచక్కా తాను గతంలో పనిచేసిన కాంగ్రెస్ పార్టీకి కీర్తిని కట్టబెడుతూ.. కాంగ్రెస్ ఎంతో మంచి పనిచేస్తే.. జగన్ చెడగొట్టాడని అంటున్నారు.
ఆయనలోని కాంగ్రెస్ ప్రేమను గమనిస్తే.. ప్రజలకు అనేక సందేహాలు కలుగుతున్నాయి. జనసేనాని పవన్ కల్యాణ్ తన తెలుగుదేశం వైపు కన్నుగీటుతోంటే.. ‘నెంబర్ టూ ప్లస్’ నాదెండ్ల మనోహర్ కాంగ్రెస్ ప్రేమను విస్మరించలేకపోతున్నారా అనిపిస్తుంది.
ఇక్కడ ప్రధానంగా గమనించాల్సిన సంగతి ఇంకోటుంది. కాంగ్రెస్ అంత మంచి చట్టం తెచ్చి ఉంటే.. అది ఎప్పుడు భ్రష్టు పట్టిపోయింది? చంద్రబాబు హయాంలోనా? జగన్ హయాంలోనా? నాదెండ్ల క్లారిటీ ఇచ్చి ఉంటే బాగుండేది. ఒకవేళ అలాంటి తప్పు జగన్ చేశారనే అనుకుందాం.. ప్రభుత్వ పరంగా ఆ తప్పు జరిగిన సమయంలో.. జనసేన పార్టీ ఏ తుప్పల్లో తొంగుని పడుకుంది. కౌలు రైతులందరూ ఆత్మహత్యలు చేసుకున్నాక జగన్ మీద నిందలువేయాలని ఎదురుచూస్తోందా? అనే అభిప్రాయం మనకు కలుగుతుంది.