
బీజేపీతో సంబంధం లేకుండానే టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకోవడం నిజం. ఇటీవల కాలంలో మూడు పార్టీలు కలిసి వైసీపీపై యుద్ధానికి వెళ్తాయనే ప్రచారం జరుగుతోంది. ఇందుకు అమిత్ షా, జేపీ నడ్డాతో చంద్రబాబు భేటీ మరింత బలాన్ని ఇస్తోంది. ఈ నేపథ్యంలో ఏఏ పార్టీ ఎక్కడెక్కడ పోటీ చేస్తుందనే చర్చకు తెరలేచింది. ఇందులో భాగంగా తిరుపతిపై జనసేన భారీ ఆశలు పెట్టుకుంది.
ఇక్కడి నుంచి పవన్‌కల్యాణ్ పోటీ చేస్తే లక్ష మెజార్టీ తెప్పిస్తామని ఆ మధ్య ఎప్పుడో తిరుపతి జనసేన నేతలు కామెడీ చేశారు కూడా. తిరుపతిలో పవన్ సామాజిక వర్గం బలంగా వుంది, నిలిస్తే గెలుపు తథ్యమని జనసేన నేతలు లెక్కలేస్తున్నారు. అయితే వారాహి యాత్ర ఉభయగోదావరి జిల్లాల నుంచి మొదలు పెడుతుండడంతో పవన్ అక్కడి నుంచే పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. మొదట తిరుపతి నుంచి వారాహి యాత్ర ప్రారంభమవుతుందని జనసేన నాయకులు అన్నారు. కానీ వేదిక మారింది.
ఈ దఫా పవన్ ఒక నియోజకవర్గం నుంచే పోటీ చేస్తారని సమాచారం. పవన్ తిరుపతి రారనే సమాచారం అందడంతో, ఆ సీటుపై అక్కడి స్థానిక జనసేన నాయకులు ఆశలు పెంచుకుంటున్నారు. చాలా కాలంగా జనసేన వాయిస్‌ను తిరుపతి ఇన్‌చార్జ్ కిరణ్ రాయల్, డాక్టర్ హరిప్రసాద్ వినిపిస్తున్నారు. పొత్తులో భాగంగా జనసేనకే తిరుపతి టికెట్ కేటాయిస్తారని టీడీపీ వర్గాలు కూడా చెబుతున్నాయి. ఎందుకంటే తిరుపతిలో ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, ఆయన కుమారుడు అభియన్‌లను ఎదుర్కొనేందుకు టీడీపీలో సరైన నేతలు లేరనేది చంద్రబాబు భావన.
జనసేన మాత్రమే భూమనను ఎదుర్కొంటుందని చంద్రబాబు నమ్ముతుండడం గమనార్హం. లోకేశ్ పాదయాత్రలో భాగంగా తిరుపతి టీడీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీంతో టికెట్ రాకపోతే అనవసరంగా ఖర్చులు పెట్టుకోవడం డబ్బు దండుగ అని మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ అంటున్నారు. ఏది ఏమైనా రానున్న ఎన్నికల్లో వైసీపీని జనసేన ఎదుర్కోనుంది. ఇప్పటి నుంచి తిరుపతిలో జనసేన కార్యకలాపాలు పెరిగే అవకాశాలున్నాయి.
నేను మొక్కలతో, దేముడితో మాట్లాడుతా