కల్వకుంట్ల తండ్రీ కొడుకులు చంద్రశేఖర రావు, తారక రామారావు మరీ అంత సమర్ధులా? తాము నిర్వహించే మంత్రిత్వ శాఖల నుంచి నాణ్యమైన ఫలితాలు తీసుకురావడం వారికి చేతకాదా? అనే ప్రశ్నలకు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ, ఫైర్ బ్రాండ్ నాయకుడు రేవంత్ రెడ్డి మాత్రం అవుననే అంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్ కె జోషి, ప్రభుత్వ శాఖలకు పని తీరును బట్టి ఇచ్చిన ర్యాంకు లే ఇందుకు నిదర్శనం అని రేవంత్ రెడ్డి ప్రస్తావిస్తూ ఉండడం విశేషం.
రేవంత్ రెడ్డి తన కుటుంబంతో సహా ఢిల్లీ వెళ్లి తమ పార్టీ జాతీయ అధ్యక్షురాలు సోనియా ను కలిశారు. అంతకు ముందు ఆయన ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి కేసీఆర్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఆయన పాలనలో రాష్ట్రం పూర్తి అధ్వాన స్థితికి చేరుకున్నది విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలోని 20 శాఖల పనితీరును సమీక్షించి, ప్రధాన కార్యదర్శి జోషి విడుదల చేసిన ర్యాంకులను, ఆయన ఇందుకు నిదర్శనంగా చూపించారు. సాగునీటి శాఖ ఎనిమిదవ ర్యాంకు, విద్యుత్ శాఖ కు 11 వ ర్యాంకు, ఐటీ శాఖకు 18వ ర్యాంకు వచ్చాయని రేవంత్ ఎద్దేవా చేశారు. మొదటి మూడు ర్యాంకుల్లో కేసీఆర్ గానీ, కేటీఆర్ గానీ నిర్వహించిన శాఖలు కూడా లేవంటూ ఎద్దేవా చేశారు.
ఎంపీ రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో ఉన్న కాలం నుంచి కూడా, కెసిఆర్ పై విచ్చలవిడిగా చెలరేగుతూ వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఓటుకు నోటు కేసులో దొరికిన అప్పటినుంచి కేసీఆర్ పై రేవంత్ విరుచుకుపడడం మరింతగా ఎక్కువైంది. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఆయన ఏమాత్రం జోరు తగ్గించలేదు. కాంగ్రెస్ పార్టీలో చేరిన తరువాత కాస్త డోస్ పెంచారు. ఎమ్మెల్యే ఎన్నికలలో అనూహ్యంగా ఓడిపోయిన రేవంత్ రెడ్డి.. ఆ తరువాత ఎంపీ ఎన్నికలలో గెలవడం ద్వారా మళ్లీ చట్టసభల సభ్యత్వాన్ని సొంతం చేసుకున్నారు.
ప్రతి సందర్భంలోనూ కేసీఆర్ ప్రభుత్వం మీద విమర్శలు కురిపిస్తూనే ఉన్నారు. ఇటీవలి కాలంలో ఆయన భారతీయ జనతా పార్టీలోకి ఫిరాయిస్తున్నారనే ప్రచారాన్ని, పటాపంచలు చేస్తూ నేడు ఢిల్లీలో సోనియా గాంధీని కలిశారు. కెసిఆర్ పై చేసిన విమర్శల్లో భాగంగా, రాష్ట్ర విద్యుత్ శాఖ 34 వేల కోట్ల రూపాయల అప్పుల్లో కూరుకుపోయి ఉంటే, దానికి పదకొండవ ర్యాంకు ఇవ్వడం హాస్యాస్పదంగా ఉన్నదంటూ రేవంత్ విమర్శించడం విశేషం.