తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు టాలీవుడ్ సినీ నిర్మాతగా కొత్త అవతారం ఎత్తబోతున్నారా? తన నిర్మాణంలో ఒక సరికొత్త సందేశాత్మక చిత్రాన్ని తెలుగు ప్రజలకు అందించడానికి ఆయన ఉత్సాహపడుతున్నారా? కళాతపస్వి కె.విశ్వనాధ్ మరోసారి మెగాఫోన్ పట్టుకోవడానికి సిద్ధం అయితే… దానికి నిర్మాతగా వ్యవహరించాలని ఉందని కేసీఆర్ ప్రకటించారు. ఆదివారం విశ్వనాధ్ ఇల్లే.. ఈ రకమైన కేసీఆర్ టాలీవుడ్ ఎంట్రీకి వేదికగా మారింది.
కేసీఆర్ ప్రజాపోరాటాల నాయకుడు.. తెలంగాణ స్వప్నాన్ని సాకారం చేసిన రాజకీయ యోధుడుగా మాత్రమే ప్రజలకు ఎక్కువగా తెలుసు. ఆయన సినీ అభిరుచి గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. కేసీఆర్ కు సినిమాలంటే చాలా ఆసక్తి. తెలుగు, ఇంగ్లిషు సినిమాలను కూడా ఆయన విపరీతంగా చూస్తారు. పురాతనకాలంలో తెలుగుదేశంలో ఉన్నప్పుడు, ఏదైనా కమిటీల్లో భాగంగా లేక్ వ్యూ గెస్ట్ హవుస్ లో కూర్చుని కొన్ని రోజుల తరబడి పనిచేయాల్సి వచ్చిన రోజుల్లో కూడా.. కేసీఆర్.. పనినుంచి కాసింత విశ్రాంతి కోసం రెగ్యులర్ గా సినిమాలకు వెళ్తుండేవారని కూడా కొందరు చెబుతుంటారు.
ఏది ఏమైనప్పటికీ సినిమాల మీద ఆయనకు అపరిమితమైన ఆసక్తి ఉన్న మాట మాత్రం నిజం. కానీ.. నిర్మాతగా మారడానికి సిద్ధపడడమే తమాషా. కేసీఆర్ కేవలం రాజకీయ నాయకుడే కాదు. మంచి కవి కూడా. ఆయనలో ఓ మంచి పాటల రచయిత ఉన్నారు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ ప్రచార గీతాలను రికార్డు చేయించినప్పుడు కూడా కేసీఆర్ కొన్ని పాటలు రాశారు. ఇన్ని రకాలుగా ఆయనకు కళాభిరుచి ఉంది.
కొత్తగా తెలిసిన విషయం ఏంటంటే.. కేసీఆర్ దర్శకుడు కె.విశ్వనాధ్ కు వీరాభిమాని. శనివారం రాత్రి ఆయన స్వయంగా విశ్వనాధ్ కు ఫోన్చేసి.. వాళ్ల ఇంటికి రావాలని ఉన్నదనే అభిలాష వ్యక్తంచేశారు. ఆ మేరకు ఆదివారం విశ్వనాధ్ ఇంటికి వచ్చారు. శంకరాభరణం 25సార్లు చూసిన తన సినీ అభిరుచిన వ్యక్తంచేశారు. పదేళ్లుగా విశ్రాంతి తీసుకుంటున్న దర్శకుడిని, మరోసారి మెగాఫోన్ పట్టుకోవాలని కోరారు. మీరు మళ్లీ దర్శకత్వం వహిస్తే.. నిర్మాణ బాధ్యతలు స్వీకరించడానికి నేను సిద్ధం అని మాట ఇచ్చారు.