బాడీ అయితే తగ్గించాడు లోకేష్ బాబు. అలాగే కాస్త గడ్డం పెట్టి.. పెద్ద తరహాలో కనిపించడానికి ప్రయత్నిస్తున్నారు. శారీకంగా స్మార్ట్ గా కనిపించడానికి లోకేష్ చాలానే కష్టపడి ఉండవచ్చు. కిలోలకు కిలోలు బరువు తగ్గడం అంటే మాటలు కాదు. అందునా తనను తాను యువరాజు లెక్క ఫీలయ్యే లోకేష్ లాంటి వాళ్లకు అది మరీ కష్టం. అయితే అంత కష్టమూ పడి ఆయన బరువైతే తగ్గారు.
కరోనా సెకెండ్ వేవ్ లాక్ డౌన్ పూర్తయిన తర్వాత డిఫరెంట్ లుక్ తో కనిపిస్తున్నారు. ఈ విషయంలో లోకేష్ తెలుగుదేశం శ్రేణులను ఉత్సాహ పరుస్తున్నాడు. అయితే ఎటొచ్చీ భాష విషయంలో, మాట్లాడే తీరు విషయంలో మాత్రం లోకేష్ లో ఇంకా మార్పు కనిపించడం లేదు.
సూటిగా చెప్పాలంటే లోకేష్ కు బాడీ అయితే మందం తగ్గింది కానీ, నాలుక మందం మాత్రం తగ్గలేదు! ముద్దగా మాట్లాడటం.. పదాలను తోచినట్టుగా పలకడం.. తనకు అవతల వాళ్లు భయపడుతున్నారని పదే పదే చెప్పుకోవడం, వేలు ఆడిస్తూ మాట్లాడటం, అన్నింటికీ మించి.. ఏ సందర్భంలో అయినా.. తను అంతా సెటిల్ చేసేసినట్టుగా కలరింగ్ ఇస్తూ మాట్లాడటం… లోకేష్ శైలి. ఈ శైలితోనే ఆయన ఆంధ్రా నవ్వుల మారాజుగా అనిపించుకుంటున్నాడు ప్రత్యర్థుల చేత. ఈ విషయంలో లోకేష్ ఇంకా మారలేదని ఆయన లేటెస్ట్ వీడియోలను వీక్షిస్తే స్పష్టం అవుతోంది.
'ఒల్ దగ్రా పెట్టుకొండా..' ఇదీ లోకేష్ నుంచి జాలువారిన మాట తీరు. ఒళ్లు దగ్గర పెట్టుకోండి అని ప్రత్యర్థులను హెచ్చరించడానికి ఒల్ దగ్రా పెట్టుకొండా.. అంటూ మాట్లాడారు లోకేష్ బాబు. ఆయన ప్రసంగం అంతా ఇదే ధోరణిలోనే సాగడం గమనార్హం.
'తీవ్రైన పర్ణామాలు ఉండిపోతున్నాయ్..' పై మాటకు కొనసాగింపు. 'తీవ్రమైన పరిణామాలు ఉండబోతున్నాయి..' అని చెప్పడానికి లోకేషుడు 'తీవ్రైన పర్ణామాలు ఉండిపోతున్నాయ్..' అని సెలవిచ్చారు!
ఇక చంద్రబాబుది చాలా పెద్ద మనసు అని, తను మాత్రం అలా కాదంటూ మరో వార్నింగూ ఇచ్చారు. ఈ వార్నింగ్ ఇచ్చే సమయంలో 'నాకోతూ ఉండదు.. ' అంటూ మరో పదప్రయోగం చేశారు. ఈ నాకోతూ ఏమిటయ్యా అంటే.. నాకైతే అలాంటి పెద్దమనసు ఉండదంటూ లోకేష్ సెలవిచ్చదలిచారనమాట! మొత్తానికి ఏళ్లకు ఏళ్లు గడుస్తున్నా.. అబ్బజబ్బదబ్బ స్టైల్ ను మాత్రం లోకేష్ వదిలించుకోలేకపోతున్నట్టున్నారు.