ఎన్సీపీకి చెందిన ఎమ్మెల్యేలకు ఇప్పుడు రొట్టె విరిగి నేతిలో పడ్డట్లు అయింది. వారి వేల్యూ ఒక్కసారిగా అమాంతం పెరిగిపోయింది. మంత్రి పదవులు ఇస్తేనే మీకు మద్దతిస్తాం.. అని వారు బేరాలు పెడుతున్నారు.
మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా, అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా ప్రభుత్వం ఏర్పడింది గానీ.. ఎవరి బలం ఏమిటో ఇప్పటిదాకా తేలలేదు. బలపరీక్షకు వ్యవధి ఉంది.. ఆ వ్యవహారంపై సుప్రీంలో కేసుంది. ఈలోగా ఎమ్మెల్యేలకోసం పార్టీలు, పదవుల కోసం ఎమ్మెల్యేలు బేరసారాలు చేసుకుంటున్నారు.
భారతీయ జనతా పార్టీకి, ప్రభుత్వంలో కొనసాగడానికి అచ్చంగా 40 మంది ఎమ్మెల్యేల బలం కావాలి. ఎన్సీపీలోంచి అజిత్ పవార్ అంతమందిని ఒకేసారి బయటకు తీసుకురాగలడా? అనేది ఒక సందేహం. అంత బలం అజిత్ పవార్ కు ఉంటే గనుక.. శరద్ పవార్ ఆ పార్టీలో సున్నా అయినట్టే. కొందరు ఎమ్మెల్యేలు మాత్రం.. ఇప్పటికీ.. శరద్, అజిత్ లు ఎలా చెబితే అలా చేస్తాం అంటూ ఇంకా సస్పెన్సును పెంచుతున్నారు.
శివసేనతో కలిసి ప్రభుత్వం ఏర్పాటుచేసే ప్రతిపాదనలు నడిచిన సమయంలో భాజపా ఆ పార్టీకి 12 మంత్రి పదవులు ఇవ్వడానికి అంగీకరించింది. ఇప్పుడు ఆ సంఖ్యను కాస్త పెంచే అవకాశం ఉంది. దానికి తగ్గట్టుగానే ఎన్సీపీ నుంచి వచ్చే వారు కూడా మంత్రి పదవులు కోరుకుంటున్నారు. మంత్రి పదవి గ్యారంటీ ఉంటే మాత్రమే అజిత్ కోటరీలోకి వస్తాం అని అంటున్నట్లు తెలుస్తోంది.
అయితే వారు అంతగా మంత్రిపదవులకోసం వెంపర్లాడాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే.. భాజపాను కాదనుకుని శివసేన ప్రభుత్వం ఏర్పడడానికి సహకరించినా కూడా వారికి అదే స్థాయిలో మంత్రి పదవులు లభిస్తాయి. అలాంటి నేపథ్యంలో ఎక్స్‌క్లూజివ్‌గా తమవెంట ఉంటేనే ఎక్కువ లబ్ధి పొందుతారు.. అని వారికి సంకేతాలు ఇవ్వడానికి భాజపా ప్రయత్నిస్తున్నది.
ఏదేమైనా ఈ బేరాలు తక్షణం ఒక కొలిక్కి రావాల్సిన అవసరం ఉంది. తక్షణం విశ్వాస పరీక్ష నిర్వహించాలన్న డిమాండ్ సుప్రీం ఎదుట ఉంది. వారి నిర్ణయం ఎలా ఉంటుందో.. ఈలోగా బేరసారాలు పూర్తవుతాయో లేదో చూడాలి.