రెండేళ్ల గ్యాప్ తరువాత తెలుగుదేశం పార్టీ మహానాడు జరుగుతోంది. ఒంగోలులో మూడు రోజుల పాటు ఈ మహానాడు జరగనుంది. ప్రతిసారీ మహానాడు ప్రస్తావన వచ్చినపుడు జూనియర్ ఎన్టీఆర్ కు ఆహ్వానం అందిందా? లేదా? అన్నది టాపిక్ గా వుండేది.
గతంలో ఓసారి అయితే లోకేష్ నాయుడు ‘ఎవరినీ ప్రత్యేకంగా పిలవరు. పార్టీ మనది అనుకున్నవారు అంతా రావడమే’ అనే టైపులో కామెంట్ చేసారు కూడా.
అయితే ఈసారి ఎన్టీఆర్ కు ప్రత్యేకంగా ఆహ్వానం పంపించారని తెలుగుదేశం పార్టీ వర్గాల బోగట్టా. క్లిష్టమైన ఎన్నికలు ఎదుర్కోవాల్సి వుంది. 2024లో ఎన్టీఆర్ మాట సాయం అయినా పార్టీకి అవసరమే.
అందుకే ఎన్టీఆర్ కు ఆహ్వానం పంపించారని ఆ వర్గాలు పేర్కొన్నాయి. కానీ ఎన్టీఆర్ కు అలాంటి ఆహ్వానమేమీ రాలేదని కూడా సినిమా జనాలు కొందరు అంటున్నారు. పంపినా, అందుకున్నా అది లోకేష్ కు, ఎన్టీఆర్ కు మధ్య మాత్రమే వుంటుందని అంటున్నారు.
ఈ మధ్య ఎన్టీఆర్ బర్త్ డే అయితే లోకేష్ ట్విట్టర్ లో ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. అందువల్ల ఆహ్వానం పంపడానికే ఎక్కువ అవకాశం వుంటుందని భావిస్తున్నారు.
ఇదిలా వుంటే మహానాడు అన్నది తెలుగుదేశం పార్టీకే పరిమితం అయిన వ్యవహారం అయినా జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ కు కూడా ఆహ్వానం పంపారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
ప్రత్యేక ఆహ్వానితునిగా మహానాడు ముగింపు కార్యక్రమానికి హాజరు కావాలని పవన్ కు ఆహ్వానం అందించారని రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. మరి పవన్ అలా హాజరవుతారా? అన్నది క్వశ్చను.
నిజంగా ఎన్టీఆర్ లేదా పవన్ ఎవరు హాజరయినా అది ఓ సెన్సేషన్ టాపిక్ అవుతుందన్నది ఖాయం. ఎన్టీఆర్ హాజురు కాకపోవడానికే ఎక్కువ అవకాశాలు వున్నాయి. అసలే దత్త పుత్రుడు అన్న ట్యాగ్ లైన్ చలామణీ చేస్తున్నందున పవన్ కూడా దూరంగానే వుంటారనుకోవాలి.