మీడియా నేరుగా తిడితే మహా అయితే ఒకటి రెండు సార్లు తిట్టొచ్చు. కానీ నిత్యం అదే తిట్ల యజ్ఞం నిర్వహించాలంటే ఎవరో ఒకరు దొరకాలి.
మన భావనలు, మన మాటలు వారి నోట పలికించాలి. అదే ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్. ఆ విధంగా జగన్ ను తిట్టడానికి టూల్ మాదిరిగా ఉపయోగపడిన నాయకుడు సబ్బం హరి.
ఈ రోజు ఓ ఛానెల్ రేపు ఇంకో ఛానెల్..ఈ రోజు మాకు..రేపు మీకు అన్నట్లు పంచుకున్నారు. జగన్ ను తిట్టుట. దానిని ప్రసారం చేయుట. కానీ పాపం, కాలం కాటేసింది.
హరి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. హరిని ఆ విధంగా వాడుకున్న పార్టీ నాయకులు విశాఖ వెళ్లి పరామర్శించిన పాపాన పోలేదు. పాపం, హరి కొడుకు భవిష్యత్ ఏమిటి? అన్నది ఎవ్వరికీ తెలియదు. పట్టదు.
ఇక ఆర్ఆర్ఆర్ అలియాస్ రఘురామ్ గురించి తెలిసిందే. ఆ వ్యవహారాలే ఇంత వరకు తెచ్చాయి. జైలుకు పంపాయి. కోర్టుకు ఈడ్చాయి. గుట్టుగా ఇంట్లో వుండే ఇల్లాలిని సైతం ఢిల్లీలో పెద్దల ఇళ్లకు వెళ్లి బతిమాలుకునేలా చేసాయి. ఇప్పుడు ఆయనను కూడా మీడియాకు దూరంగా వుండమన్నది కోర్టు.
ఇక మరి ఇప్పుడు ఎవరు? ఆ రెండు ఛానెళ్లకు సాయంత్రం వేళ పేరంటం పెట్టడానికి పెద్ద ముత్తయిదువుగా ఎవరు వస్తారు? తెలుగుదేశం సీనియర్లు అంతా తెలివైన వారు అమావాస్యకు, పున్నానికి ఓ స్టేట్ మెంట్ పడేస్తారు తప్ప ఇలాంటి వ్యవహారాల జోలికి పోరు.
కాంగ్రెస్ లేదా చిన్న చితక నాయకులు ఎవరైనా మళ్లీ రంగంలోకి దిగాలి. కానీ ఆర్ఆర్ఆర్ వ్యవహారం చూసాక అంత ధైర్యం చేస్తారా? ఏమో?