గ్రామ సచివాలయాలు అందుబాటులోకి వస్తే మీసేవా కేంద్రాలను మూసివేస్తామంటూ వైఎస్ జగన్ గతంలో ప్రకటించారు. అయితే వేలాది మంది ఉద్యోగులు తాము ఉపాధి కోల్పోతామంటూ రోడ్డెక్కే సరికి ఆ నిర్ణయంపై ఇంకా క్లారిటీ రాలేదు. కానీ మీసేవా కేంద్రాలు మాత్రం అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా మారాయని తాజాగా మరోసారి రుజువైంది. రాష్ట్రంలో ఇసుక కొరత వేధిస్తున్న సమయంలో మరోవైపు మీసేవా కేంద్రాలలో జరుగుతున్న అక్రమాల వల్ల బ్లాక్ మార్కెట్ పుంజుకొంది.
ఇసుక పాలసీలో పారదర్శకత కోసం ఆన్ లైన్లో అప్లికేషన్ పెట్టుకునే వ్యవస్థకు జగన్ శ్రీకారం చుట్టారు. ప్రతిరోజూ నిర్ణీత సమయంలో ఇసుక పోర్టల్ లో ఎవరైనా లాగిన్ అయి ఇసుకను బుక్ చేసుకోవచ్చు. మీసేవా కేంద్రాలకు ప్రత్యేకమైన సర్వర్లు ఉంటాయి కాబట్టి పని తొందరగా అవుతుంది. దీనికోసం 50 రూపాయలు సర్వీస్ చార్జ్ వసూలు చేస్తారు. ఇక్కడే ఇసుక మాఫియా కొన్ని మీసేవా కేంద్రాల ఉద్యోగులతో చేతులు కలిపి అక్రమాలకు తెరతీసింది.
తమ తరపున ఇసుక బుక్ చేసినందుకు నెలకు 20వేల రూపాయలకు రేటు మాట్లాడుకున్నారు. ఉదయం 12 గంటలకు వెబ్ పోర్టల్ ఓపెన్ కాగానే మీసేవా కేంద్రాల్లో ఇసుక బుకింగ్ మొదలవుతుంది. దళారులకు సంబంధించిన పేర్లతో రోజూ ఇసుక బుక్ చేస్తుంటారు, నిమిషాల వ్యవధిలో మొత్తం ఇసుక బుక్ అయిపోతుంది. సామాన్యులు లాగిన్ అయ్యే సమయానికి నో స్టాక్ అనే మెసేజ్ కనిపిస్తుంది. ఎక్కువగా ఇసుక డంపింగ్ యార్డ్ లు నిర్వహించేవారే ఇలా మీసేవా కేంద్రాల్లో గుంపగుత్తగా ఇసుక బుక్ చేసుకుని తరలించేసుకుంటున్నారు. ఆ తర్వాత అది బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నారు.
తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు, తత్కాల్ టికెట్లు బుక్ చేసుకోవాలన్నా కాస్త సమయం ఉంటుంది, కానీ ఏపీలో ఇసుక బుక్ చేసుకోవాలంటే మాత్రం క్షణాల్లో నో స్టాక్ అనే మెసేజ్ కనిపిస్తోంది. ఇదంతా పద్ధతి ప్రకారం జరిగిపోతుండటంతో ఎవరీకి అనుమానం రాలేదు. ఇటీవల ఇసుక విధానంపై మంత్రులు, ఎమ్మెల్యేలు స్థానిక అధికారులకు గట్టిగా క్లాస్ తీసుకోవడంతో, మీసేవా కేంద్రాలపై నిఘా పెట్టడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
ఆన్ లైన్ విధానం ప్రకటించే సమయంలో ఇసుక బుక్ చేసుకునేవారు తమ ఇంటి ప్లాన్ అప్రూవల్, వివరాలు జతచేయాలనే నిబంధన ఉంది. కానీ చాలామంది దీనిని వ్యతిరేకించడంతో తొలగించారు. ఇప్పుడిదే లొసుగుని అడ్డం పెట్టుకుని అక్రమార్కులు ఇసుకను బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్నారు. మీసేవా కేంద్రాలపై నిఘా పెడితే ఇసుక మాఫియా కొంతమేరకైనా అదుపులోకి వస్తుంది. సచివాలయాలు పూర్తిగా అందుబాటులోకి వచ్చాక, మీసేవా కేంద్రాలను మూసివేస్తేనే.. భవిష్యత్ లో ఇక ఎలాంటి అక్రమాలకూ తావులేకుండా చేయొచ్చు.