వీరిని వచ్చే ఏడాదిలోనే రాజ్యసభకు పంపే అవకాశం ఉంది. ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో వారికి టికెట్ దక్కకపోవచ్చుననే ప్రచారం సాగుతోంది. ఎందుకంటే.. పరిస్థితులు మరీ అనూహ్యమైన వేగంతో పరిణామాలు జరిగితే తప్ప.. వారిద్దరి మంత్రి పదవులకు తక్షణం వచ్చిన ఢోకా ఏమీ లేదు. ఇంకో ఏడాది దాకా వారు ఆ పదవుల్లో కొనసాగడానికి అవకాశం ఉంది. అప్పటికి మళ్లీ రాజ్యసభ ఎన్నికలు వస్తాయి. రాష్ట్రం నుంచి మరో నలుగురికి అవకాశం వస్తుంది. అప్పుడు ఈ ఇద్దరికీ అవకాశం దక్కుతుందనే ప్రచారం సాగుతోంది.
రాజ్యసభ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. మొత్తం 55 స్థానాలు ఖాళీ అవుతున్నాయి. వాటికి త్వరలో ఎన్నికలు జరుగుతాయి. తెలుగు రాష్ట్రాలకు సంబంధించినంత వరకు తెలంగాణలో రెండు, ఆంధ్రప్రదేశ్ లో నాలుగు స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. ఇప్పుడున్న బలాబలాలను బట్టి.. మొత్తం అన్ని స్థానాలనూ అధికార పార్టీలే కైవశం చేసుకోనున్నాయి. ఆ ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ నుంచి వైకాపా బలం రాజ్యసభలో ప్రస్తుతం ఉన్న రెండు నుంచి, ఆరుకు పెరుగుతుంది.
రెండు స్థానాలకు అయోధ్య రామిరెడ్డి, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పేర్లు దాదాపుగా ఖరారైనట్లే. అయితే మిగిలిన రెండింటికే బాగా పోటీ ఉంది. శాసనమండలిని రద్దుచేసిన జగన్మోహన రెడ్డి ఆ సభ నుంచి మంత్రులుగా ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణలకు ఎంపీ పదవులు కట్టబెడతారని ఒక ప్రచారం ఉంది. అయితే.. వారికి తక్షణం ప్రత్యామ్నాయం చూపాల్సిన అవసరం లేదు. శాసనమండలి రద్దు అనేది నిర్ణయం అమల్లోకి రావడానికి ఇంకా కొంతకాలం పడుతుంది.
ఒకవేళ రద్దయినా కూడా.. కనీసం ఆరునెలలపాటూ వారు ఏ సభలోనూ సభ్యులుగా లేకుండానే.. మంత్రి పదవుల్లోల కొనసాగవచ్చు. ఆ పైన మరోసారి ప్రమాణం చేయిస్తే.. మరో ఆరునెలలు కూడా కొనసాగవచ్చు. అయితే.. ఈలోగా, వచ్చే ఏడాదిలో ఆంధ్రప్రదేశ్ కోటాలో మరో నాలుగు ఎంపీసీట్లు ఖాళీ అవుతాయి. అప్పుడు మళ్లీ అన్నీ వైకాపాకే దక్కే చాన్సు వస్తుంది. అప్పటిదాకా వీరిని మంత్రులుగా కొనసాగిస్తే అప్పుడు ఎంపీ పదవులు ఇవ్వవచ్చు.
వైకాపా తొలిసారి అధికారంలోకి వచ్చినందున.. పార్టీమీద ఎంపీ పదవులకోసం కూడా ఒత్తిడి చాలా ఉంది. ఆ నేపథ్యంలో ప్రస్తుతం మిగిలిన రెండు సీట్లను ఇతర సామాజికవర్గాల్లో ముఖ్యులకు కేటాయించి.. మాజీలయ్యే అవకాశం ఉన్న ఈ మంత్రులకు వచ్చే ఏడాది పదవులిస్తారనే ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో సాగుతున్నాయి.