ఇంతకీ వచ్చే ఎన్నికల్లో నారా లోకేష్ ఏ నియోజకవర్గంలో పోటీ చేయబోతున్నారు? అంటే.. ఎంతటి పచ్చచొక్కా కూడా సమాధానం కోసం తడుముకోవాల్సిందే! ఏడాదిన్నర కిందట కాబోలు.. మళ్లీ మంగళగిరి అని ప్రకటించినట్టుగా ఉన్నారు. అయితే ఆ తర్వాత అక్కడ కూడా హడావుడి ఏమీ లేదు! మంగళగిరి రాజకీయం కూడా అప్పటికీ ఇప్పటికీ చాలా మారింది.
ఇలాంటి నేపథ్యంలో లోకేష్ మంగళగిరి నుంచి పోటీ చేస్తారనే ధృవీకరణ కూడా మరోసారి ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతలా గ్యాప్ వచ్చింది!. అయితే.. లోకేష్ పోటీ ఎక్కడ నుంచి అనే దానిపై మిస్టరీని కొనసాగించడానికే చంద్రబాబు నాయుడు ప్రాధాన్యతను ఇస్తున్నట్టుగా ఉన్నారు.
లోకేష్ ఎక్కడ నుంచి పోటీ చేస్తున్నదీ ఇప్పుడే ప్రకటించేస్తే.. అక్కడ వైరి పక్షం అన్ని అస్త్రాలనూ మోహరిస్తుందనేది చంద్రబాబు, లోకేష్ ల భయం లాగుంది. ఫలానా చోట పోటీ అనే ప్రకటన వస్తే.. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలర్ట్ అయిపోయి, మరోసారి లోకేష్ ఓటమికి ఆ పార్టీ గట్టిగా ప్రయత్నిస్తుందనే భయం ఉండవచ్చు.
ఎలాగూ తొలి సారి ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయిన ఘనత లోకేష్ ది. అది కూడా మంత్రి హోదాలో, ముఖ్యమంత్రి తనయుడి హోదాలో ఎన్నికలకు వెళ్లి ఆయన ఓటమి పాలయ్యారు. వచ్చే ఎన్నికల్లో లోకేష్ తేల్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వచ్చే ఎన్నికల్లో కూడా లోకేష్ గనుక ఓటమి పాలైతే ఆయన రాజకీయ జీవితం అంతటితో ముగిసినట్టే!
ఎర్రబుక్కు చంకలో పెట్టుకుని లోకేష్ వ్యాపారం చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి వచ్చే ఎన్నికల్లో ఎక్కడ నుంచి పోటీ చేసినా.. అక్కడ విజయం కోసం తీవ్రంగా కష్టపడాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో.. ప్రత్యర్థులకు ముందస్తు అవకాశం ఇవ్వకుండా, ఆఖరి వరకూ లోకేష్ ఎక్కడ నుంచి పోటీ చేస్తాడనేది దాచి ఉంచేలా ఉన్నారు. ఇదీ నారా లోకేష్ పరిస్థితి. మరి ఈ దాచిఉంచడం సంగతెలా ఉన్నా.. ఎక్కడ నుంచి పోటీ దాని గురించి కనీసం క్లారిటీ అయితేనే వీలైనంత త్వరగా తెచ్చుకోవాల్సిన అవసరం మాత్రం ఎంతైనా ఉన్నట్టుంది!