మీడియా విషయంలో జగన్ కు ప్రత్యేకంగా సలహాదారులు లేనప్పుడు కూడా జాతీయ మీడియాలో ఆయన గురించి మంచి కథనాలే వచ్చాయి. జగన్ మోహన్ రెడ్డికి జాతి మీడియా సపోర్ట్ చేయకపోయినా, అప్పుడు జాతీయ మీడియా గట్టిగానే సపోర్ట్ చేసింది. అయితే ఇప్పుడు అధికారంలోకి వచ్చాకా దేవులపల్లి అమర్ ను ప్రత్యేకంగా జాతీయ మీడియా సలహాదారుగా నియమించుకున్నారు. కానీ.. పల్నాడు వ్యవహారంలో తెలుగుదేశం తీరు జాతీయ మీడియాలో హైలెట్ కావడం గమనార్హం.
పల్నాడు వ్యవహారంలో ఏం జరిగిందో, ఏం జరుగుతోందో స్థానికులకు తెలుసు. అక్కడ ఇన్నాళ్లూ తెలుగుదేశం పార్టీ వాళ్లు అల్లకల్లోలం రేపారు. ఇప్పుడు అధికారం చేజారేసరికే అందుకు రియాక్షన్స్ వస్తున్నాయి. అవి గ్రామస్థాయి వ్యవహారాలు. వాటిని రాజకీయంగా మలుచుకుంటున్నారు చంద్రబాబు నాయుడు. తన కులస్తులైన నేతలను పక్కన పెట్టి, పల్నాడుతో సంబంధం లేని నేతలను రంగంలోకి దించి చంద్రబాబు రాజకీయం సాగుతూ ఉంది. ఇలాంటి నేపథ్యంలో శాంతిభద్రతల కారణం దృష్ట్యా చంద్రబాబును ఇంట్లోనే ఉంచారు.
ఈ సంఘటన పూర్వాపరాలను జాతీయ మీడియా వర్గాలు పట్టించుకోలేదు. చంద్రబాబు గృహ నిర్బంధం మాత్రమే హైలెట్ అయ్యింది. జాతీయ మీడియాలో అందుకు సంబంధించి కథనాలు వచ్చాయి. మరి అంత జరుగుతుంటే.. సంఘటన పూర్వాపరాలను వివరించడంలో జాతీయ మీడియా సలహాదారు ఏం చేసినట్టు? అంతకుముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆ వ్యవహారం గురించి పూర్తి వివరాలను మీడియాకు అందించారు కూడా. అయినా అవేవీ రాలేదు. చంద్రబాబు హౌస్ అరెస్ట్ మాత్రమే జాతీయ మీడియాలో కవరేజ్ అయ్యింది.
ఇలా ఎందుకు జరిగిందో.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సమీక్షించుకోవాల్సిన అవసరం కనిపిస్తూ ఉందని పరిశీలకులు అంటున్నారు. ప్రత్యేకంగా జాతీయ మీడియా సలహాదారు నియమితం అయిన నేపథ్యంలో.. ఈ వ్యవహారం చర్చకు దారితీస్తూ ఉంది. ఇంతకూ ఆయన ఎందుకున్నట్టు అనే ప్రశ్నలూ వ్యక్తం అవుతున్నాయి!