తెలుగుదేశం పార్టీ నాయకులారా పారాహుషార్! మీ జేబుకు చిల్లు పెట్టడానికి కొత్త కార్యక్రమం ఒకటి రూపొందింది. మీరు మీ మీ ప్రాంతాలనుంచి వందల సంఖ్యలో ప్రజలను వెంటబెట్టుకుని… అమరావతి కి వెళ్ళాలి. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలవాలి. మీతో వచ్చిన ప్రజలందరూ ఆయనతో మరో పెట్టుకోవాలి. అమరావతి రాజధానిగా ఉండాలని… దానిని తరలించడం తమకు ఇష్టం లేదని వారందరూ, ప్రజలు తిరస్కరించిన ఈ నాయకుడి కి విన్నవించుకోవాలి. ఇదే కొత్త డ్రామా!
రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఈ సరికొత్త డ్రామాకు ఇన్నోవేటివ్ స్క్రిప్టు రాశారు. తొలి ప్రదర్శన ఆయన ఆధ్వర్యంలో జరిగింది. ఇక ఈ సరికొత్త ఆలోచన రాష్ట్రవ్యాప్తంగా అనుసరించి తీరాల్సిందే. కామెడీ ఏమిటంటే బుచ్చయ్య చౌదరి ఆధ్వర్యంలో రాజమండ్రి ప్రాంత ప్రజలు చంద్రబాబును కలిసి గొల్లుమన్నారు. రాజధాని అమరావతి లోనే ఉండాలని చెప్పుకున్నారు.
పరిపాలన వికేంద్రీకరణ అనే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ఆలోచన ప్రజల నుంచి తాము ఆశించిన రీతిలో వ్యతిరేకత వ్యక్తం కాకపోయే సరికి తెలుగుదేశం కొత్త నాటకం ప్రారంభించింది. రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాలలో భిక్షాటన పేరుతో చంద్రబాబు నాయుడు సాగించిన కార్యక్రమాలు, ప్రదర్శనలు, నిరసనలు అన్నీ కూడా ప్రజల మద్దతు లేకుండా నీరుగారిపోయాయి. ఆ నేపథ్యంలో తాను ఇతర ప్రాంతాల్లో జనంలోకి వెళ్లి నిరసనలు చేస్తే ఉన్న పరువు కూడా తుస్సు మంటుందని ఆయన గ్రహించారు. దీంతో జనాన్ని తన వద్దకు రప్పించుకునే టెక్నిక్ ప్రారంభించారు. ఇక్కడైతే వచ్చిన జనం మొత్తం తనను కీర్తించే వాళ్లే. తన మాటకు జై కొట్టే వాళ్లే. ఎక్కడా బలహీనత బయటపడదు..! అది కొత్త రాజనీతి.
అయితే ఈ డ్రామాలు చూసి తెలుగుదేశం నాయకులే బెంబేలెత్తుతున్నారు. తమ తమ ఊర్ల నుంచి అమరావతి అంటే అయ్యే ఖర్చు తలచుకొని జడుసుకుంటున్నారు. ప్రజల్లో లేని భావనను, లేని వ్యతిరేకతను బలవంతంగా రుద్ధి… వారితో అలాంటి మాటలు చెప్పించడానికి చాలా ఖర్చవుతుంది అని భయపడుతున్నారు. పరిపాలన వికేంద్రీకరణ విషయంలో ఇక చేయగలిగింది ఏమీ లేకపోయినప్పటికీ చంద్రబాబు కోసం ఈ డ్రామాలకు ఖర్చు చేయాలంటే వెనుకాడుతున్నారు.