ఏపీ ప్రభుత్వం ఆయనను తొలగించింది. అయితే హై కోర్టు ఆ జీవోలను రద్దు చేసింది. నిమ్మగడ్డను తొలగించడానికి ఉపయోగించిన జీవోతో పాటు, కొత్త ఎస్ఈసీ నియామకానికి సంబంధించిన జీవోలను కూడా హై కోర్టు రద్దు చేసినట్టే అనుకోవాలి. అయితే మీడియాలో వచ్చే వార్తల్లో కోర్టు తీర్పుల గురించి హైలెట్స్ మాత్రమే ఉంటాయి. ఏదో క్రికెట్ మ్యాచ్ ఫలితం గురించి చెప్పినట్టుగా మీడియా కోర్టుతీర్పుల గురించి చెబుతూ ఉంటుంది. అయితే తీర్పు కాపీ ఒకటి ఉంటుంది. జీవోలను రద్దు చేయడం అంటే.. చించేయడం ఏమీ కాదు, ఆ జీవోను కూడా రాష్ట్ర ప్రభుత్వ హక్కుల మేరకే ఇచ్చి ఉంటారు. ఆ జీవోలను రద్దు చేయడం అంటే ఆ హక్కులు కూడా ప్రశ్నార్థకం అయినట్టే.
ఈ నేపథ్యంలో ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ అడ్వొకేట్ జనరల్ స్పందించారు. హై కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం చూస్తే.. ఎస్ఈసీ నియామకానికి అసలు రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి అధికారం ఉండదని, సూచన కూడా ఇవ్వడానికి వీల్లేదన్నట్టుగా హై కోర్టు చెప్పిందని ఏజీ అంటున్నారు. ఈ లెక్కన నిమ్మగడ్డ నియామకం జరిగింది ఏపీ ప్రభుత్వ సూచన మేరకే కాబట్టి, అది కూడా చెల్లదేమో అంటున్నారు ఏజీ!
ఈ విషయంపై తాము సుప్రీం కోర్టు కు వెళ్లాలనున్నట్టుగా ఆయన స్పష్టం చేశారు. అలాగే హై కోర్టు తీర్పుపై స్టేను కూడా కోరుతూ మరో పిటిషన్ దాఖలు చేయనున్నట్టుగా తెలిపారు. హైకోర్టు తీర్పు నచ్చకుంటే సుప్రీం కోర్టుకు వెళ్లే అధికారం అయినా ఏపీ ప్రభుత్వానికి ఉండవచ్చు. అయితే ఇంతలో నిమ్మగడ్డ చాలా అత్యుత్సాహ పడిపోయినట్టుగా ఉన్నారు.
ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీవోలను హై కోర్టు రద్దు చేసిందంటే, అధికారం మొత్తం నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు అప్పగించినట్టుగా కాదేమో! పాత జీవోలను హై కోర్టు రద్దు చేసినా, కొత్త జీవో వచ్చాకే నిమ్మగడ్డ బాధ్యతలు తీసుకోవాల్సి ఉండొచ్చు. అయితే నిమ్మగడ్డ మాత్రం తనకు తానే ఎస్ఈసీగా బాధ్యతలను ప్రకటించేసుకున్నారట! అంతేగాక ఆ హోదాల్లో అప్పుడే ఉత్తర్వులు ఇచ్చేశారు, తనకు నచ్చని వాళ్లు రాజీనామాలు చేయాలని కూడా ఆదేశాలు ఇచ్చేశారు!
ఆల్రెడీ సొంత నిర్ణయంతో స్థానిక ఎన్నికలను వాయిదా వేసి సుప్రీం కోర్టు మొట్టికాయ తిన్నారు నిమ్మగడ్డ. హై కోర్టు జీవోలను రద్దు చేసినంత మాత్రాన నిమ్మగడ్డ చేసిందంతా రైటని కాదు. రాష్ట్ర ప్రభుత్వానికి కనీస సమాచారం ఇవ్వకుండా ఎన్నికల వాయిదా నిర్ణయం తీసుకోవడం గురించి ఆయనకు అప్పట్లోనే సుప్రీం కోర్టు తలంటింది. అయినా మళ్లీ కూడా ఆయన తీరు మారినట్టుగా లేదని పరిశీలకులు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా తన అజెండానేదో అమలు చేయాలని ఆయన ప్రయత్నిస్తున్నట్టుగా ఉన్నారని, కనీసం జీవో వచ్చేంత వరకూ, ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టు వెళ్లేంత వరకూ కూడా ఆయన ఆగలేకపోయినట్టుగా ఉన్నారని.. విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.