తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు మనవడు, స్టార్ హీరో ఎన్టీఆర్ వైసీపీలోకి రాబోతున్నారా? అవుననే అంటున్నారు విశ్లేషకులు. ఈ మేరకు తెరవెనక ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. అయితే ఎన్టీఆర్ నేరుగా వచ్చి వైసీపీలో చేరితే కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. అందుకే ముందుగా ఎన్టీఆర్ కు ఓ మంచి పదవి ఇచ్చే ఆలోచనలో ఉంది ఆ పార్టీ.
ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖకు బ్రాండ్ అంబాసిడర్ గా ఎన్టీఆర్ పేరు తెరపైకి వచ్చింది. ఎన్టీఆర్ ను బ్రాండ్ అంబాసిడర్ గా ప్రకటిస్తే.. ఆయన అనధికారిక వైసీపీ సభ్యుడిగా మారినట్టే. ఆ తర్వాత పార్టీలో చేరడం అనేది లాంఛనమే. ఎన్టీఆర్ మామ నార్నె శ్రీనివాసరావు, ఎన్టీఆర్ కు అత్యంత ఆప్తుడైన కొడాలి నాని ప్రస్తుతం వైసీపీలోనే ఉన్నారు. వీళ్ల చొరవతోనే జగన్ ముందుకు ఈ ప్రతిపాదన వెళ్లినట్టు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ టూరిజంకు బ్రాండ్ అంబాసిడర్ గా ఎన్టీఆర్ ను నియమించే ప్రతిపాదనను ముందుగా జగన్ అంగీకరించాలి. జగన్ ఒక్కసారి ఓకే చెబితే, ఇక ఎన్టీఆర్ ను ఒప్పించే బాధ్యతను వీళ్లిద్దరూ తీసుకుంటారు. తాజా సమాచారం ప్రకారం, ఎన్టీఆర్ చూచాయగా అంగీకరించిన తర్వాతే జగన్ ముందుకు ఈ ప్రతిపాదన వెళ్లినట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ కు ప్రత్యామ్నాయంగా స్టార్ షెట్లర్ పీవీ సింధు పేరు కూడా పరిశీలనలో ఉంది.
ఓవైపు తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ ను తమ భవిష్యత్ ఆశాదీపంగా చూస్తోంది. ఇప్పటికే ఎంతోమంది టీడీపీ నేతలు, ఎన్టీఆర్ పార్టీలోకి రావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఎన్టీఆర్ పార్టీ పగ్గాలు స్వీకరిస్తే తప్ప టీడీపీకి మనుగడ లేదంటూ చాలామంది నేతలు బాహాటంగానే చెప్పుకొస్తున్నారు. మరోవైపు ఎన్టీఆర్ మాత్రం టీడీపీలో ఉండడానికి పెద్దగా ఆసక్తి చూపడంలేదనేది బహిరంగ రహస్యం.
గతంలో తనకు, తన తండ్రి హరికృష్ణకు చంద్రబాబు ప్రాధాన్యం తగ్గించిన విషయాన్ని ఎన్టీఆర్ మరిచిపోలేదు. కొడుకు లోకేష్ కోసం చంద్రబాబు, ఎన్టీఆర్ ను ఎలా సైడ్ చేశారో.. అతడ్ని పార్టీకి ఎలా దూరం చేశారో అంతా చూశారు. ఇప్పుడు కూడా నందమూరి వంశస్థులెవరికీ పార్టీ పగ్గాలు అప్పగించే ఆలోచనలో చంద్రబాబు లేరు. లోకేష్ నే అధ్యక్షుడిగా తయారుచేసేందుకు బాబు పావులు కదుపుతున్నారు.
ఈ పరిణామాలన్నీ ఎన్టీఆర్ గమనిస్తూనే ఉన్నారు. అందుకే చాలా ఏళ్లుగా తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. తాత స్థాపించిన తెలుగుదేశం పార్టీలో ఓ సైనికుడిగా పనిచేయాలని భావించిన ఎన్టీఆర్ ను అడుగడుగునా అడ్డుకున్నారు బాబు. ఆ కోపం ఎన్టీఆర్ లో ఇంకా ఉంది.
దీనికితోడు ఇప్పుడు మామ నార్నె శ్రీనివాసరావు, అత్యంత ఆప్తుడు నాని వైసీపీలో ఉండడం ఎన్టీఆర్ కు కలిసొచ్చింది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్, వైసీపీ సర్కార్ ఆఫర్ చేసే టూరిజం బ్రాండ్ అంబాసిడర్ పదవిని తిరస్కరించే అవకాశం లేదంటున్నారు విశ్లేషకులు.