రాజధాని విషయమై ఏడాదిన్నర క్రితం జనసేనాని పవన్‌కల్యాణ్ అద్భుతంగా అంచనా వేశాడు. భవిష్యత్‌ను ముందుగానే పసిగట్టాడు. రాజధాని విషయంలో చంద్రబాబు వైఖరి రాబోవు రోజుల్లో ఎలాంటి దుష్ప్రరిణామాలను తీసుకొస్తుందో వివరంగా చెప్పి హెచ్చరికలు చేశాడు. అప్పట్లో ఆయన భయమే నేడు నిజమవుతోంది. అప్పట్లో ఎంతో బాగా మాట్లాడాడని ప్రశంసించిన వాళ్లే నేడు ఈ మనిషి ఏమిటి ఇట్లా మాట్లాడుతున్నాడే అని ప్రశ్నిస్తున్నారు. నాడు కాలజ్ఞానిలా భవిష్యత్ గురించి చెప్పిన పవన్ …ప్రస్తుతం అజ్ఞానం వైపు ప్రయాణిస్తున్నాడనే వాదన బలంగా వినిపిస్తోంది.
2018 , ఏప్రిల్ 8. ఐవైఆర్ కృష్ణారావు రచించిన ‘ఎవరి రాజధాని అమరావతి?’ పుస్తకావిష్కరణ. విజయవాడలో నిర్వహించిన సభకు ముఖ్య అతిథిగా పవన్‌కల్యాణ్ హాజరయ్యాడు. ఉండవల్లి అరుణ్‌కుమార్, వడ్డే శోభనాద్రీశ్వరరావు లాంటి పెద్దలు పాల్గొన్న సభలో పవన్ ఎంతో స్ఫూర్తిదాయక ప్రసంగం చేశాడు. రాజధాని విషయమై బాబు సర్కార్ పాల్పడుతున్న అవినీతిపై ఆయన కళ్లు తెరిపించాడు. ఇంతకూ ఆ సభలో ఆయన ఏం మాట్లాడారంటే…
‘‘రాజధాని నిర్మాణానికి భూములు సమీకరించినప్పుడు సామాజిక ప్రభావం అంచనా వేయలేదు. సైబరాబాద్ కట్టే సమయంలో నాటి చంద్రబాబు ప్రభుత్వం తమవారికి, అనుయాయులకు ముందుగానే విషయాన్ని చెప్పి ఆ చుట్టుపక్కల భూములు కొనిపించింది. రైతులు ఎకరా రూ.4-5 లక్షలకే అమ్ముకున్నారు. ఆ తర్వాత వాటిని కొన్నవారు అవే భూములను వందల కోట్లకు విక్రయించుకున్నారు. ఆంధ్రా వాళ్లే మోసం చేశారని రైతులు కోపం పెంచుకున్నారు. ఇప్పుడు ఇక్కడా ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది. రాజధాని ఎక్కడొస్తుందో ముందే తెలుసుకుని కొన్ని ఎకరాలను పట్టేసుకున్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ వారు వచ్చి అమరావతిలో ఇంటిస్థలం కొనుగోలు చేయగలరా? హైదరాబాద్‌లో చేసిన తప్పులే ఇక్కడా చేస్తున్నారు. అవి ఇలాగే కొనసాగితే కుల, వర్గ, అస్తిత్వ పోరాటాలు ముందుకొస్తాయి. మళ్లీ రాయలసీమ ఉద్యమం అని, మరొకటని ముందుకొస్తాయి’’ అని ఆయన హెచ్చరించారు.
సైబరాబాద్ కట్టే సమయంలో నాటి చంద్రబాబు సర్కార్ ఎలాంటి మోసాలకు పాల్పడిందో , ఇప్పుడు రాజధాని నిర్మాణంలో కూడా అలాంటి పరిస్థితే కనిపిస్తోందని ఏడాదిన్నర క్రితం పవన్‌కల్యాణ్ స్పష్టం చేశాడు. జగన్ సర్కార్ చేస్తున్న ఆరోపణలు కూడా ఇవే కదా. దాన్ని నిగ్గు తేల్చేందుకే కదా ఈ తతంగమంతా. రాజధాని ఎక్కడొస్తుందో ముందే తెలుసుకుని 4,070 ఎకరాలకు పైగా భూమని చంద్రబాబుతో పాటు ఆయనకు బాగా కావాల్సిన వాళ్లు విచ్చలవిడిగా కొనుగోలు చేసి ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారని అసెంబ్లీ సాక్షిగా ఆధారాలతో సహా ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి బయట పెట్టిన విషయాన్ని పవన్ మరిచారా?
హైదరాబాద్‌లో చేసిన తప్పులే ఇక్కడా చేస్తున్నారని, ఇలాగే కొనసాగితే కుల, వర్గ, అస్తిత్వ పోరాటాలు ముందుకు వస్తాయని నాడు పవన్ చెప్పిందే నేడు నిజమవుతోంది కదా? రాజధాని ప్రకటన, నిర్మాణంలో చంద్రబాబు పాలన అప్రజాస్వామికంగా, అవినీతితో వ్యవహరించిందని నాడు చెప్పిన పవన్….నేడు అందుకు విరుద్ధంగా విశాఖపట్నం రాజధానిగా జగన్ చెప్పలేదని, కర్నూల్‌లో హైకోర్టు పెట్టే అధికారం వీళ్లకు ఉందా అంటూ పొంతన లేని మాటలు మాట్లాడడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి.
ఈ వేళ రాజధాని రైతులకు కష్టాలు రావడానికి ఎవరి అత్యాశ, అవినీతో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత పవన్‌పై లేదా? రాజధాని ప్రాంతంలో నేడు పర్యటించనున్న పవన్ ఆ విషయాలను ధైర్యంగా చెబుతాడా? లేక చంద్రబాబు స్క్రిప్ట్‌ను చదివి వస్తాడా? ఏడాదిన్నర క్రితం ఎంతో లోతైన అధ్యయనం, విశ్లేషణతో జ్ఞానవంతంగా మాట్లాడిన పవనేనా, ప్రస్తుతం అజ్ఞానంతో మాట్లాడుతున్నదని అభిమానులే ఆవేదన చెందుతున్నారు.