మీడియా అంటే ఏదో కొందరు వ్యక్తులను మేనేజి చేస్తే సరిపోతుంది. అవసరమైతే ఓసారి ఎడిటర్లతోనూ, బ్యూరో చీఫ్ లతోనూ స్టార్ హోటళ్లలో సమావేశాలు పెట్టి, వారికి విందుభోజనాలు తినిపించి, వారందరితోనూ ఫోటోలు దిగి సంతృప్తి పరిస్తే సరిపోతుంది. ఇక తన వ్యవహారాలకు సంబంధించినంతవరకు కవరేజీ మరీ నెగటివ్‌గా రాకుండా వారు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు.
కానీ సోషల్ మీడియా సంగతి కాదే! ఈ ‘సోషల్’ ప్లాట్ ఫాం మీద యాక్టివ్ గా కొన్ని లక్షల మంది ఉంటారు. వారిలో ఏ ఒక్కరు వాస్తవాలు మాట్లాడినా.. అది కోట్ల మందికి చేరిపోతుంటుంది. వారందరినీ కట్టడి చేయడం అసాధ్యం కూడా. అలాగని వారందరినీ ‘మేనేజ్’ చేయడం సాధ్యమయ్యే పనికాదు. అందుకే జనసేనాని పవన్ కల్యాణ్.. మీకు ఇబ్బందులు అభ్యంతరాలు ఉంటే నాకు చెప్పండి అంతే తప్ప.. సోషల్ మీడియాకు మాత్రం ఎక్కవద్దండి అంటూ బతిమాలుకుంటున్నారు. పార్టీ నాయకులతో ఎంపీ నియోజకవర్గాల వారీగా నిర్వహిస్తున్న సమీక్ష సమావేశాల్లో ఈ మేరకు ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు.
పవన్ కల్యాణ్ విజయవాడలో తిష్టవేసి వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు గానీ, పార్టీ మీద పోటీచేసిన అభ్యర్థులకు, ఇతర నాయకులకు ఇంకా పూర్తి నమ్మకం కలిగినట్లుగా లేదు. సమావేశంలో మాట్లాడే సంగతి ఎలా ఉన్నా.. బయటమాత్రం వారు పెదవి విరుస్తున్నారు. పార్టీని గాడినపెట్టి, ఉద్ధరించడం ఎలా అనే విషయంలో పవన్ కల్యాణ్ ఏదో ఒకరిద్దరి సలహాల మీద ఆధారపడుతున్నారే తప్ప.. క్షేత్రస్థాయిలో ఉండి పనిచేసే తమ వాదనలను కనీసం చెవిన వేసుకోవడం లేదనే వ్యాఖ్య పలువురినుంచి వినిపిస్తుంటుంది.
అందుకే కాబోలు.. విజయవాడ నాయకులతో నిర్వహించిన సమావేశంలో పవన్ అదే మాట చెప్పారు. మీ అభ్యంతరాల్ని నాతోనే చెప్పండి.. సోషల్ మీడియాలో వద్దు అంటున్నారు. నిజానికి పార్టీ నేతల ఆవేదన అదే. చెప్పదలచుకున్నప్పుడు.. ఆయన వినిపించుకోవడం లేదని. ఎవరు చెప్పదలచుకున్నా.. పవన్ అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం, సోషల్ మీడియాలో వెళ్లగక్కితే ఆగ్రహించడం మామూలైపోయిందని అనుకుంటున్నారు.