పవన్ కల్యాణ్ మాటలు.. మతిలేని మాటలుగా మారుతున్నాయి. ఏదో ఒకటి విమర్శలు చేయకుంటే.. తనకు మనుగడ ఉండదని ఆయన భయపడుతున్నట్లుగా ఉంది. అలాగని ప్రజల పక్షాన నిలిచి పోరాడేంత సత్తా కూడా లేని పవన్ కల్యాణ్.. వరుస ప్రెస్ నోట్లు విడుదల చేసే బిజీ పనుల్లో ఆయన ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. జగన్ ఆరునెలల పాలన పూర్తయిన సందర్భంగా పవన్ కల్యాణ్ ఒక స్పెషల్ ప్రకటన కూడా విడుదల చేశారు.
దీంతో ఆరు రకాలుగా జగన్ పాలన కనిపిస్తున్నదని.. తన ఆక్రోశాన్నంతా వెళ్ల గక్కారు. అదంతా ఒక ఎత్తు. తెలుగు భాషను పరిరక్షించేందుకు ఉద్యమం స్టార్ట్ చేశానని అంటున్న పవన్ కల్యాణ్.. ఒక చిత్రమైన మాట చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశ పెడుతున్నందుకు తెలుగు టీచర్లంతా కలవరపడుతున్నారట. తమకు బదులుగా గ్రామ వాలంటీర్ల వంటి వారిని పెట్టుకుంటారని.. తెలుగు ఉపాధ్యాయులంతా.. భయపడిపోతున్నారట. పాఠశాలల్లో బోధించే మీడియం ఇంగ్లిషుకు మారుతున్న సమయంలో.. తెలుగు టీచర్లు ఆందోళన చెందడం ఏంటో అర్థం కావడం లేదు!
ఇంతకూ అసలు పవన్‌కు దిమాగ్ ఉందా అని ప్రజల్లో సందేహం కలుగుతోంది. పవన్ కల్యాణ్‌కు అసలు ప్రభుత్వ నిర్ణయం ఏంటో తెలుసా? ఆ నిర్ణయంలో ఉన్న లోపం ఏంటో తెలుసా? నష్టం ఎంతమేరకు, ఎవరికి జరుగుతుందో తెలుసా? అని ప్రజలకు ఆశ్చర్యం కలుగుతోంది! ఇంగ్లిషుమీడియం వల్ల ఏం జరుగుతుందో తెలిసే మాట్లాడుతున్నారా.. లేదా గొర్రెదాటుగా అందరూ విమర్శిస్తున్నారు గనుక.. తాను కూడా విమర్శలు చేస్తున్నారా అర్థం కావడం లేదు.
ఎందుకంటే.. మీడియం ఇంగ్లిషుకు మారినంత మాత్రాన.. తెలుగు టీచర్లకు వచ్చే ప్రారబ్ధం ఏమీ లేదు. నిజానికి అందరికంటె నిశ్చింతగా నిమ్మళంగా ఉద్యోగ భద్రతతో ఉండేది వాళ్లు మాత్రమే. తెలుగు సబ్జెక్టు స్కూళ్లలో యథావిధిగా ఉంటుంది. తెలుగు టీచర్లు తెలుగులోనే పాఠాలు చెప్పుకోవచ్చు. వారి అవసరం ఇంకా పెరుగుతుంది. సబ్జెక్టు టీచర్లు మాత్రం ఇంగ్లిషులో చెప్పడం నేర్చుకోవాల్సి వస్తుంది. జగన్ నిర్ణయం గురించి ఇంగ్లిషు మీడియం అంటే ఏమిటో తెలియకుండానే పవన్ కల్యాణ్ విమర్శలు చేస్తుండడం గర్హనీయంగా ఉంది.