Advertisement

Advertisement


Home > Politics - Gossip

రాపాక మీద ఆశలు వదులుకున్నట్టే!

రాపాక మీద ఆశలు వదులుకున్నట్టే!

ముఖ్యమంత్రి అయిపోయి రాష్ట్రాన్ని మొత్తం రూపురేఖలు మార్చేస్తా అని ఆయన బీరాలు పలికారు. తీరా రెండుచోట్ల పోటీచేసి రెండూ ఓడిపోయారు. చావు తప్పి కన్ను లొట్టపోయినట్టుగా.. పార్టీకి చెప్పుకోడానికి ఒక సీటు దక్కింది. గెలిచిన ఎమ్మెల్యే కూడా జగన్ పథకాలు శెభాసంటూ వారిని కీర్తించడంలో కాలం గడుపుతున్నారు. ఇప్పుడు పవన్ కల్యాణ్ ఏం చేయగలరు? ఏమీ లేదు.. ఆ ఉన్న ఒక్క ఎమ్మెల్యే మీద ఆయన కూడా ఆశలు వదిలేసుకుంటున్నట్లుగా కనిపిస్తోంది.

జనసేన కార్యకర్తల మీద కాకినాడలో దాడి జరిగింది. పార్టీ అధినాయకుడు హస్తినలో ఉన్నారు. పార్టీకి ఉన్న సదరు ఒకే ఒక్క ఎమ్మెల్యే గాయపడిన తమ పార్టీ వారిని కనీసం పరామర్శించడానికి కూడా వెళ్లలేదు. పవన్ కల్యాణ్ ఢిల్లీనుంచి నేరుగా ఇటు వస్తే.. ఆయన కార్యక్రమానికి కూడా ఎమ్మెల్యే రాలేదు. తద్వారా.. తాను వైకాపాతో సన్నిహితంగా మెలగడం మాత్రమే కాదు.. పవన్ కల్యాణ్ పార్టీ జనసేనతో తెగతెంపులు చేసుకోవడానికి కూడా సిద్ధమేనని ఆయన పరోక్ష సంకేతాలు ఇచ్చేశారు.

ఏదో ఆవేశపూరితంగా జనాన్ని ఉర్రూతలూగించేలా ప్రసంగాలు చేయడంలో పవన్ కల్యాణ్ రాణిస్తున్నారు గానీ.. ఒక నాయకుడిగా పార్టీని నడపడంలో ఆయన పూర్తిగా విఫలం అవుతున్నారు. సంస్థాగతంగా పార్టీని నిర్మించుకోవడమే చేతకాకుండా.. ఆరేళ్లుగా ఆ పార్టీ.. శైశవావస్థలోనే ఉంది. తన లోపాల్ని ఎవరైనా ఎత్తిచూపితే.. ప్రజలే నా వ్యవస్థ, నిర్మాణం.. అంటూ పడికట్టు సినిమా డైలాగులు చెబుతూ పవన్ ఇతరుల్ని ఆడిపోసుకుంటారు. చివరికి పార్టీ తరఫున గెలిచిన వారిని తమ పక్షాన్నే నిలబెట్టుకోవడంలో కూడా ఆయన విఫలం అవుతున్నారు.

రాపాక వరప్రసాద్ గురించి విలేకర్లు అడిగినప్పుడు.. ‘‘ఏమో ఆయనకు ఎలాంటి వత్తిడులు ఉన్నాయో ఏమో’’ అని పవన్ జవాబివ్వడం చిత్రం. రాపాక మీద ఆయన ఆశ వదిలేసుకున్నట్టుంది. రాపాక దూరం కావడాన్ని ఇతరుల మీదికి నెట్టే ప్రయత్నంలాగా ఈ మాట కనిపిస్తుంది. విలేకర్లతో పవన్ అలా అంటే పర్లేదు గానీ.. కనీసం ఆయన అంతరంగంలోనైనా.. తన వైఫల్యాల వలనే తనమీద నమ్మకం లేకనే నాయకులు దూరం జరుగుతున్నారని గుర్తిస్తే ఆయనకే మంచిది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?