పవన్ కల్యాణ్.. దుకాన్ బంద్ సంకేతాలు!

ఏంటో.. ప్రజలకు అన్నీ విషయాలూ ముందే తెలిసిపోతుంటాయి! పవన్ కల్యాణ్, కేంద్రంలోని భారతీయ జనతా పార్టీతో మిలాఖత్ కాబోతున్నాడని చాలాకాలంగా ప్రజలకు తెలుసు. దీన్ని గురించి మీడియాలో రాసిన వారిని పవన్ దళాలు బండబూతులు…

ఏంటో.. ప్రజలకు అన్నీ విషయాలూ ముందే తెలిసిపోతుంటాయి! పవన్ కల్యాణ్, కేంద్రంలోని భారతీయ జనతా పార్టీతో మిలాఖత్ కాబోతున్నాడని చాలాకాలంగా ప్రజలకు తెలుసు. దీన్ని గురించి మీడియాలో రాసిన వారిని పవన్ దళాలు బండబూతులు తిట్టాయి. ఆయన తరఫు వారంతా ఆ మాటలను ఖండించారు. తీరా ఇప్పుడు ‘జాతీయ పార్టీలు పిలుస్తున్నాయి’ అంటూ పవన్ నెమ్మదిగా ఓ ఫీలర్ వదిలారు. ఇది ఖచ్చితంగా జనసేన ‘దుకాన్ బంద్’ నిర్ణయానికి తొలిసంకేతంగానే భావించాల్సి ఉంటుంది.

ఆరుశాతం ఓట్లు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నదని మురిసిపోతున్న పవన్ కల్యాణ్.. జాతీయ పార్టీలతో పొత్తు పెట్టుకోడానికి చాలా ఉబలాటంగా ఉన్నారు. అమెరికాకు వెళ్లి.. అక్కడ భాజపా వ్యూహకర్త రాంమాధవ్‌తో సమావేశమైన పవన్ కల్యాణ్, ఆయన నుంచి పాజిటివ్ హామీలను పొందినట్లుగా కనిపిస్తోంది. అందుకే ఆయన ఆ మైత్రిని బయటపెట్టడంలో అస్సలు ఆగలేకపోతున్నారు. అక్కడి నుంచి తిరిగివచ్చాక ఏర్పాటుచేసిన తొలి విలేకర్ల సమావేశంలోనే విషయం చెప్పేశారు.

‘జనసేనను ఎందులోనూ విలీనం చేయను’ అనికూడా పవన్ ప్రకటించారు. కాకపోతే ఇది ప్రస్తుతానికి చెప్పిన మాటగానే పరిగణించాలి. రేప్పొద్దున్న దుకాన్ బంద్ చేసి.. పార్టీని కమలదళంలో కలిపేసిన తర్వాత.. ‘‘ప్రజావసరాల కోసం, రాజకీయ స్థిరత్వం కోసం తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయం’’గా పవన్ దానిని అభివర్ణించుకున్నా ఆశ్చర్యంలేదు.

నిజానికి పవన్‌ను ఇప్పుడు జాతీయ పార్టీలు పిలవడం ఏమిటి? చాలా విచిత్రమైన అబద్ధం ఇది. ఈ ఎన్నికల్లోనే ఆయన జాతీయపార్టీలతోనే కలిసి నడిచారు. తన కాపు కులం ఓట్లకు దళితుల ఓట్లను కూడా  కూడగట్టుకుంటే.. అచ్చంగా అధికారంలోకి వచ్చేయగలనని అనుకున్న కుహనా మేధస్సుతో పవన్ కల్యాణ్ చెలరేగిపోయారు. దళితముద్ర ఉన్న బీఎస్పీని నెత్తిన పెట్టుకున్నారు. మాయావతిని తెగపొగిడారు. అప్పుడే ఆయన జాతీయ పార్టీతో కలిసి ప్రయాణం చేసినట్లు లెక్క.

తాజాగా బీఎస్పీ తీవ్రంగా వ్యతిరేకించి భాజపాతో చెట్టపట్టాలు వేసుకోడానికి ఉబలాటపడుతున్నారు. తన రాజకీయ ప్రస్థానంలో స్థిరమైన దృక్పథం, కనీసమైన సిద్ధాంతబలం ఏమాత్రం లేని పవన్ కల్యాణ్ ఆ పార్టీకి మాత్రం ఎలా బలం అవుతారో చూడాలి.

క్యాడర్ ను పట్టించుకోని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు!