శాసనసభలో ఒకే ఒక ఎమ్మెల్యేను కలిగి ఉన్న పార్టీ జనసేన అధినేత పవన్ కల్యాణ్.. రాష్ట్ర ప్రజల్లో తమ పార్టీ ఇమేజి పెంచడం కోసం రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్రకు సిద్ధం అవుతున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి, చంద్రబాబునాయుడు, జగన్మోహనరెడ్డి అందరూ.. పాదయాత్ర తర్వాత అధికారంలోకి వచ్చిన ఉదాహరణలు ఉండడంతో.. తాను కూడా.. పాదయాత్ర చేసి.. సీఎం పీఠానికి చేరువ కావాలని ఆయన స్కెచ్ వేస్తున్నట్లుగా ఉంది.
తొందరపడి ఒక కోయిల ముందే కూసిందన్నట్లుగా… ఆయన ప్రభుత్వ పదవీకాలం ఇంకా నాలుగున్నరేళ్లు ఉండగానే.. అప్పుడే పాదయాత్రల ముచ్చట తెస్తుండడం చిత్రంగా ఉంది.
ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా మండపేటలో పర్యటిస్తున్న పవన్ కల్యాణ్.. స్వయంగా తాను చేపట్టబోయే పాదయాత్రకు సంబంధించి సంకేతాలు ఇచ్చారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా ఒకేవిడతగా పాదయాత్ర చేస్తారా? లేదా, విడతలు విడతలుగా వివిధ ప్రాంతాల్లో జిల్లాల్లో పాదయాత్ర చేస్తారా? అనేది మాత్రం ఆయన స్పష్టంగా చెప్పలేదు.
మండపేట నియోజకవర్గం పరిధిలో.. వెలగోడు ధాన్యం రైతులతో పవన్ కల్యాణ్ మాట్లాడారు. తాను తూర్పు గోదావరి జిల్లా పర్యటనకు వస్తున్నానని తెలియగానే.. ప్రభుత్వం భయపడిపోయిందని పవన్ చెప్పుకొచ్చారు.
తన పర్యటన ఖరారు కావడంతో జగన్ సర్కారు భయపడిపోయి… ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి .. రూ.80 కోట్ల విల్లులను విడుదల చేసిందని పవన్ కల్యాణ్ చాలా ఘనంగా చెప్పుకున్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గతంలో నేతలందరూ ఓట్లకోసం పాదయాత్రలు చేశారని… ఇప్పుడు రైతుల కన్నీరు తుడిచేందుకు పాదయాత్రల అవసరం ఉన్నదని పవన్ కల్యాణ్ అన్నారు. దాంతో పవన్ కల్యాణ్ త్వరలోనే రైతు సమస్యలే ఎజెండాగా రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయబోతున్నారని ప్రజలకు అర్థమైంది.
వారంతా ఆయన ఆ మాట అనగానే హర్షధ్వానాలు చేశారు. అధికారంలోకి రావడానికి సెంటిమెంట్ గా పాదయాత్ర ఒక మార్గం అని పవన్ నమ్మి ఉండవచ్చు గానీ.. మరీ ఇంత తొందరగా ఎందుకు ప్లాన్ చేస్తున్నట్లో అని విశ్లేషకులు విస్తుపోతున్నారు.