వకీల్ సాబ్ సినిమా విడుదల సమయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై వైకాపా అధినేత జగన్ కు విపరీతమైన కోపం వచ్చిందన్నది ప్రచారంలోకి వచ్చింది. అందుకే టికెట్ రేట్లు సవరించారని, అదనపు ఆటలు ఇవ్వలేదని కూడా టాక్ వచ్చింది.
అయితే ఇదంతా జగన్ వ్యవహారం కాదని ఆయన మంత్రి వర్గంలోని మంత్రి ఒకరు అత్యుత్సాహంతో చేసిన పని అని కూడా రాజకీయ వర్గాల్లో ప్రచారంలో వుంది. అలాగే అదనపు ఆటలు అన్నది ఈస్ట్ గోదావరి జాయింట్ కలెక్టర్ ను కోర్టుకు లాగడం వంటి వ్యవహారాల వల్ల ముదిరి, బిగిసింది అని కూడా టాక్ వుంది.
సరే ఈ విషయాలు ఇలా వుంటే, సహజంగానే ఓ కారణంగా జగన్ కు నిజంగానే పవన్ పై కోపం వచ్చిందని తెలుస్తోంది. దానికి కాస్త సహేతుకమైన కారణమే వుందని తెలుస్తోంది.
విషయం ఏమిటంటే పవన్ కళ్యాణ్ తన వకీల్ సాబ్ సినిమా ఫంక్షన్ లో మాట్లాడుతూ 'తనకు పాల ఫ్యాక్టరీలు, సిమెంట్ ఫ్యాక్టరీలు లేవు' అంటూ కాస్త పొలిటికల్ టచ్ వున్న స్పీచ్ ఇచ్చారట. అదిగో అక్కడ వచ్చింది సమస్య.
పవన్ జనసేన అధిపతిగా వీధుల్లోకి వచ్చి ఏవిధంగా అయినా మాట్లాడవచ్చు, పొలిటికల్ విమర్శలు చేయొచ్చు. కానీ సినిమా ఫంక్షన్ లో పొలిటికల్ టచ్ వున్న డైలాగులు మాట్లాడడం ఏమిటి? అది సరి కాదు కదా..అన్నది జగన్ కు కాస్తా ఆగ్రహం కలిగించిందన్నది వైకాపా వర్గాల నుంచి తెలుస్తున్న విషయం.
అది ఏమో కానీ చేతిలో వున్న సినిమాలు అన్నీ పూర్తయి, విడుదల అయ్యే వరకు ఇకపై పవన్ ప్రసంగాలు అన్నీ కాస్త ఆచి తూచి వుంటాయని, ఆమేరకు ఆయన నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. లేదూ అంటే నిర్మాతలు కుదేలయిపోతారు కదా?