పేదల జీవితాలతో రాజకీయ క్రీడ!

దాదాపు 55 వేల కుటుంబాల జీవితాలకు సంబంధించిన, వారి ఆశలతో ముడిపడిన సమస్య. రాష్ట్రంలోని పార్టీలు మాత్రం వాటిపై రాజకీయ క్రీడ సాగిస్తున్నాయి. పేదల జీవితాలు ఇరు పార్టీలకు రాజకీయ క్రీడావస్తువుగా మారిపోవడం విశేషం.…

దాదాపు 55 వేల కుటుంబాల జీవితాలకు సంబంధించిన, వారి ఆశలతో ముడిపడిన సమస్య. రాష్ట్రంలోని పార్టీలు మాత్రం వాటిపై రాజకీయ క్రీడ సాగిస్తున్నాయి. పేదల జీవితాలు ఇరు పార్టీలకు రాజకీయ క్రీడావస్తువుగా మారిపోవడం విశేషం. రాజధాని ప్రాంతంలో పేదలకు ఇంటిస్థలాల కేటాయింపు అనేది ఇవాళ.. కోర్టులో నలుగుతోంది. ఎప్పటికి తేలుతుందో కూడా అర్థం కాని సంగతి.

రాజధాని ప్రాంతం సీఆర్డీయే పరిధిలో సుమారు 55వేల కుటుంబాలకు ఇంటి పట్టాలను మంజూరుచేస్తూ 1251 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. సీఆర్డీయే పరిధిలోనే అయినప్పటికీ.. ప్రభుత్వ భూములను గుర్తించి.. ఇలా పేదలకు ఇచ్చేసి ఉంటే.. అసలు ఎలాంటి రాద్ధాంతం ఉండేది కాదు. ఏ ఒక్కరూ ఒక్క మాట కూడా మాట్లాడ్డానికి అవకాశమూ ఉండూది కాదు. కానీ, రాజధాని నిర్మాణం కోసం రైతులనుంచి సేకరించిన భూములను, ఇప్పుడు ఇలా పేదలకు కేటాయించడంతో వివాదం మొదలైంది. ఇది సీఆర్డీయే చట్టానికి విరుద్ధంగా ఉన్నదంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.

నిజానికి జగన్ ప్రభుత్వం కూడా ఇలాంటి ఇబ్బంది వస్తుందని ముందే పసిగట్టింది. అందుకే సీఆర్డీయే చట్టంలోని 53డి సెక్షన్ ను ప్రస్తావించింది.. దాని ప్రకారం.. సేకరించిన భూమిలో 5 శాతం పేదలకు నివాసాలకోసం ఇవ్వవచ్చుననే నిబంధన ప్రకారమే ఇస్తున్నట్లుగా జీవోలో పేర్కొన్నారు. దానిని కూడా కోర్టులో సవాలు చేశారు. విచారణ సందర్భంగా తాజాగా.. అసలు ప్రభుత్వ భూములు ఇవ్వకుండా సేకరించిన భూములు ఇవ్వడంలో ఉద్దేశం ఏమిటో సోమవారానికి అఫిడవిట్ వేయాలంటూ కోర్టు నిర్దేశించింది.

జగన్ ప్రభుత్వమే సీఆర్డీయే చట్టాన్ని గత శాసనసభ సమావేశాల్లో రద్దు చేసింది. ఆ తీర్మానం ఇంకా అమల్లోకి రాకపోగా, అదే చట్టం ప్రకారం పేదలకు ఇళ్లు ఇచ్చింది. ఆ సంగతి కూడా ఇప్పుడు హైకోర్టులో ప్రస్తావనార్హం అవుతోంది. రాజధానిని సీఆర్డీయే ప్రకారం పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి ఉంటే, అన్ని నిర్మణాలు వచ్చి ఉంటే అప్పుడు 5 శాతం పేదలకు ఇవ్వడం కూడా సబబే కానీ… అసలు ఎలాంటి నిర్మాణాలే చేయకుండా, తుది నోటిఫికేషన్ కూడా రాకుండా.. ముందుగా పేదలకు ఇచ్చేయడం ఏంటని కోర్టు ప్రశ్నిస్తోంది.

ఈ వివాదం ఇప్పట్లో తేలేది కాదు. ప్రభుత్వ సంకల్పం ప్రకారం.. మార్చి 25న పేదలకు ఇళ్లపట్టాలు ఇవ్వాలి. ఆ సంగతి ఏజీ కోర్టులో కూడా చెప్పారు. అయితే ఆరోజున పట్టాలు చేతికొస్తాయేమో గానీ.. కోర్టు వివాదం ముగిసి ఆ స్థలాలపై తమకు యాజమాన్యం వస్తుందో లేదో పేదలకు సందేహమే.. పార్టీల రాజకీయ క్రీడలో పేదల జీవితాలు, ఆశలు ఊగిసలాడుతున్నాయి.

సీన్ రివర్స్ అయింది..!