Advertisement

Advertisement


Home > Politics - Gossip

ఆర్టీసీ విలీనం: ప్రజలకు ఏంటి లాభం?

ఆర్టీసీ విలీనం: ప్రజలకు ఏంటి లాభం?

ఆర్టీసీ విలీన ప్రక్రియ మొదలైంది. ఊరూవాడా సంబరాలు మొదలయ్యాయి. అయితే ఆ సంబరాలన్నీ కేవలం ఆర్టీసీ బస్టాండ్ లకు మాత్రమే పరిమితమవుతున్నాయి. ఆర్టీసీ విలీనంతో లాభపడేది కేవలం ఆ సంస్థ ఉద్యోగులు మాత్రమే. ఇప్పటివరకూ జరిగిన, జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే ఇదే నిజమనిపిస్తోంది. మరి రవాణా సంస్థను ప్రభుత్వంలో కలిపేసుకుంటే ప్రజలకు వచ్చే లాభమేంటి? వారి జీవితాలపై ఇది ఎంతవరకు ప్రభావం చూపుతుంది?

బస్సు చార్జీలు పెరిగి సగటు ప్రయాణికుడిపై దెబ్బపడితే అది ప్రభుత్వానికి మంచిదేనా? ఇప్పటి వరకూ ప్రభుత్వం తీసుకున్న ఏ నిర్ణయమూ ప్రజలపై భారం పెంచేదిగా లేదు. ఆశావర్కర్ల జీతాలు పెంచినా, వాలంటీర్ల పేరుతో కొత్త ఉద్యోగాలు సృష్టించినా, పాఠశాలల్లో మౌలిక వసతులకు నిధులు కేటాయించినా.. వీటన్నిటి వల్లా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రజలకు మేలే జరుగుతుంది. మరి ఆర్టీసీ విలీనం సంగతేంటి? ఆ సంస్థ ఉద్యోగుల కోసం ప్రజలపై భారం పెంచుతారా? అందరిలోనూ ఇదే ప్రశ్న మెదులుతోంది.

స్థూలంగా ఆర్టీసీ విలీనంతో ప్రభుత్వంపై ఏటా రూ.3300 కోట్ల భారం పడుతుంది. మరి దీన్ని ఎలా సర్దుబాటు చేసుకుంటారనేదే ప్రశ్న. తాను చేయలేని పనిని వైసీపీ చేయడంతో ప్రతిపక్ష టీడీపీ కూడా ఈ విలీనాన్ని ఓ కంట కనిపెడుతూ ఉంది. తనకు ఉపయోగపడే ఏ అవకాశాన్నీ వదిలిపెట్టకూడదనే ఉద్దేశంతో గోతికాడ నక్కలా కాచుక్కూర్చుంది. చార్జీలు పెంచినా, ఆర్టీసీ ఆస్తుల్ని అమ్మినా రోడ్డెక్కి నిరసనలు చేయడానికి రెడీగా ఉంది. అయితే జగన్ వీరికి అలాంటి అవకాశం ఇవ్వరు.

ఆర్టీసీ విలీన ప్రక్రియ కోసం కమిటీ నిర్ణయాన్ని పరిగణనలోకి తీసుకున్నా.. జగన్ స్టాండ్ మాత్రం వేరే ఉంది. ఇప్పటివరకూ ప్రభుత్వాలు, ప్రభుత్వాధినేతలు ఆర్టీసీ అంశాన్ని తమ అవసరాల కోసం వాడుకున్నారు కానీ కార్మికుల కష్టాలను, ప్రజల అవసరాలను ఏమాత్రం పట్టించుకోలేదు. ఆర్టీసీ విలీనంపై మాట ఇచ్చేముందే, అంటే ఎన్నికలకు ముందే జగన్ దగ్గర ఈ విషయంపై ఓ పూర్తిస్థాయి నివేదిక ఉంది. విలీనం పూర్తయిన తర్వాత ఆ నివేదిక ప్రకారం తన ఆలోచనలు అమలు చేస్తున్నారు సీఎం.

దాని ప్రకారం ఆర్టీసీ ప్రభుత్వానికి ఆదాయ వనరుగా మారుతుంది తప్పితే అదనపు భారం ఎంతమాత్రం కాదు. మరీ ముఖ్యంగా చార్జీల పెంపుతో ప్రజలపై భారం కూడా పడకుండా చేయాలనేదే జగన్ ఆలోచన. తొలి ఏడాది విమర్శలు ఎదురైనా.. వచ్చే ఎన్నికల నాటికి ఆర్టీసీ విలీనం అనేది జగన్ తీసుకున్న అత్యుత్తమ నిర్ణయాల్లో ఒకటనే భావనకు ప్రజలు వస్తారని పార్టీ అంచనా వేస్తోంది.

జగన్ దగ్గర ఉన్న ప్రణాళిక ప్రకారం ఆర్టీసీ ఆస్తుల్ని సమగ్రంగా, సమర్థంగా వినియోగించుకుంటూ.. వృథాను పూర్తిగా నియంత్రిస్తూ.. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందిస్తూ రవాణా సంస్థను అభివృద్ధిలోకి తీసుకొస్తారు. ప్రభుత్వానికి లాభం చేకూరిందంటే, అది ప్రజలకు లాభం చేకూరినట్టే కదా. 

తెలుగులో సినీప్రియుల రూటు మారింది

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?